ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో బీఆర్ఎస్ ( BRS ) పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, స్థానిక నాయకులు ఇమ్రాన్, సతీమణి కౌసర్ బేగం, దాదాపు 500 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళలకు రూ. 2500, పెన్షన్ రూ. 4వేలు పెంపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం వంటి హామీలు ఏవీ అమలు కాలేదని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయామని ఆర్మూర్ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్, జీవన్ రెడ్డిల నాయకత్వాన్ని ప్రజలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పదేళ్ల కాలంలో కేసీఆర్, కేటీఆర్ సహకారంతో జీవన్ రెడ్డి ఆర్మూర్లో వందల కోట్ల రూపాయలతో ఊహించని అభివృద్ధి చేశారని కొనియాడారు.
కాంగ్రెస్ మోసానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, ఆర్మూర్ మున్సిపాలిటీపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.