మోర్తాడ్/రెంజల్/బోధన్ రూరల్, సెప్టెంబర్ 2: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. విష్ణుపురి, బాలేగాం, ఇతర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలచేశారు. దీంతో కందకుర్తి సమీపంలోని రెంజల్ మండలంలోని గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదిపై నిర్మించిన హైలెవెల్ వంతెనను ఆనుకొని వరద పోటెత్తింది. నదిలోని పురాతన శివాలయం గుడి, శిఖరంపై నుంచి సుమారు 4 అడుగుల ఎత్తుతో నీరు ప్రవహించింది.
పోచంపాడ్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2.50 లక్షల క్యూసెక్కల ఇన్‌ఫ్లో వస్తుండడంతో సోమవారం ఉదయం గేట్లను ఎత్తారు. రాత్రి 8గంటలకు 3 లక్షలకు పైగా ఇన్‌ఫ్లో కొనసాగడంతో 41 గేట్ల ద్వారా 3.14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, 1088 అడుగులు (72.99 టీఎంసీలు) మేర నీటి నిల్వను కొనసాగిస్తూ, మిగిలిన నీటిని వచ్చినట్లు దిగువకు విడిచి పెడుతున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్, నిర్మల్ ఎస్పీ జానకీషర్మిళ, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఎస్ఈ శ్రీనివాస్‌రావు, ఈఈ చక్రపాణిలతో ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌పైకి ఎవరిని రాకుండా చూడాలని, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
నిన్నటిదాకా బోసిపోయిన మంజీరా నది ఇప్పుడు పరవళ్లు తొక్కుతున్నది. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిండుగా ప్రవహిస్తున్నది. బోధన్ మండలం సాలూర వద్ద ఉన్న పాత వంతెనను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అటువైపు వెళ్లే వాహనాలను నియంత్రిస్తున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో అధికారులు మహారాష్ట్ర వైపు రాకపోకలను నిలిపివేశారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనను తాకుతూ గోదావరి ప్రవహిస్తుండడంతో వాహనాలను అనుమతించడం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెంజల్ పోలీసులు బారికేడ్లను అడ్డం పెట్టి వాహన రాకపోకలను నిలిపి వేశారు.