షరతులు లేని పంట రుణాల మాఫీ కోసం ఇందూరు రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఎర్రజొన్నల ఉద్యమం తరహాలో మరోమారు రణభేరి మోగించింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షల్లేని రుణమాఫీ కోసం శనివారం ఆర్మూర్ గడ్డ మీద మహా ధర్నాను నిర్వహించనున్నది. ఇందుకోసం మూడు నియోజకవర్గాల రైతులతో కూడిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంక్షల్లేని రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో నిర్వహించనున్న ఈ శాంతియుత ఆందోళన కార్యక్రమానికి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం తలపెట్టిన ఈ మహా ధర్నాను విజయవంతం చేసేందుకు అన్ని రైతు సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. మరోవైపు, కర్షకుల పోరాటానికి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.
-మోర్తాడ్/డిచ్పల్లి, ఆగస్టు 23
ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 23: రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే రైతు నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మోసం చేసింది. అందుకే శనివారం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మూడు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలి రానున్నారు. సాయిగార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. షరతులు లేని రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తాం. స్పందించకుంటే పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాలక్ష్యం ఒక్కటే. సీఎం చెప్పినట్లుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– ఇట్టడి లింగారెడ్డి, ఐక్యకార్యాచరణకమిటీ ఇన్చార్జి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అమలు చేసే విషయంలో అనేక కొర్రీలు పెట్టడం రైతాంగాన్ని ఆగ్రహానికి గురి చేసింది. మూడు విడుతల్లో మాఫీ చేసినప్పటికీ, జిల్లాలో సగం కన్నా తక్కువ మందికే మాఫీ వర్తించడం, మిగతా వారికి రాకపోవడంతో అన్నదాతల్లో అసంతృప్తి చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న అర్గుల్‌లో సమావేశమైన మూడు నియోజకవర్గాల అన్నదాతలు..
రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. షరతుల్లేని రుణమాఫీ, రైతు భరోసా కోసం శనివారం జాతీయ రహదారిని దిగ్బంధించాలని నిర్ణయించారు. ఎర్రజొన్నల ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, మహాధర్నాకు పూనుకున్నారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ఈ పోరాటానికి ఊరూరా మద్దతు వెల్లువెత్తుతుతున్నది. రైతుసంఘాలు ఆడ, మగ తేడాలేకుండా ప్రతి ఇంటి నుంచి ఇద్దరు చొప్పున ధర్నాకు వెళ్లాలని రైతు సంఘాలు తీర్మానించాయి.
రైతుల శాంతియుత ఆందోళనకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసుల ద్వంద వైఖరి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహా ధర్నాకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, శాంతియుతంగా జరుపుకోవాలంటూ పలు షరతులు విధిస్తూ ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అనుమతి ఇచ్చారని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఇన్చార్జి ఇట్టడి లింగారెడ్డి తెలిపారు.
మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీ,లెఫ్ట్ పార్టీలు, ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తాలో 44వ నేషనల్ హైవేపై నిర్వహించ తలపెట్టిన ‘చలో ఆర్మూర్’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని సీపీ కల్మేశ్వర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నామని, చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు ఏసీపీ అనుమతి ఇవ్వడం, ఇటు సీపీ పర్మిషన్ లేదనడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిన వైనంపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమరభేరిని మోగించింది. మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 22న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా రైతుల నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ రైతులకు మద్దతుగా నిలుస్తుందని, పోరాటాన్ని కొనసాగిస్తుందని మాజీ మంత్రి వేముల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ప్రకటించారు. రైతు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతు మహా ధర్నా నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. ఎలాగైనా విఫలం చేసేందుకు కుటిల ప్రయత్నాలు ప్రారంభించింది. ధర్నా విజయవంతం కాకుండా రైతులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామాలకు వచ్చి ధర్నాకు వెళ్లవద్దని, అనుమతి లేని ఆందోళనకు వెళ్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్నాను విజయవంతం చేసి సర్కారు కళ్లు తెరిపిస్తామని స్పష్టం చేస్తున్నారు.