Murdered | వినాయక్ నగర్, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కిరాణా దుకాణం ముందు ఒక గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తిని మెడకు బట్ట, సుతిలితో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్యచేసినట్లు గుర్తించాం. మృతుడి ఒంటి మీద బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉంది. మృతుడి వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటుంది. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తి గా తెలుస్తుందని పోలీసులు వివరించారు. అతడి దగ్గర ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని, ఈ ఘటన పై కిరాణా షాపు యజమాని ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు దయచేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు లేదా 87126 59714 నెంబర్కు సమాచారమివ్వాలని ఎస్హెచ్వో వెల్లడించారు.