వినాయక్ నగర్, జూన్ 17: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై దొరికాడు. వినాయక్‌నగర్‌లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు సదరు వ్యక్తి ఫొటోతో పాటు వివరాలను పలు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడంతోపాటు కుటుంబ సభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజమౌళి మృతదేహాన్ని వినాయక్ నగర్‌లోని 100 ఫీట్ల రోడ్డు చివరలో గల పూలాంగు వాగులో గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా చంపి వాగులో పడేశారా అనే కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.