నవీపేట, జూన్ 25: విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లింగాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెం శివకుమార్ పొలంలో ఇటీవల కురిసిన గాలివానకు ఎల్టీ వైర్లు తెగిపడ్డాయి. వాటికి మరమ్మతు చేసే క్రమంలో ఎల్టీ వైర్లు లాగేందుకు అదే గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి(44)ని తీసుకువెళ్లాడు.
పొలం శివారులో ఒకే స్తంభంపైనే ఎల్టీ వైర్లతోపాటు 11 కేవీ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఎల్టీ వైర్లు లాగే ప్రయత్నంలో పోశెట్టి చేతులు పైకి ఎత్తడంతో పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి స్తంభంపైనే మృతిచెందాడు. పోశెట్టికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భార్య రెంజర్ల సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.