నవీపేట, ఏప్రిల్ 28: తన కూతురును వేధించవద్దని అల్లుడిని మందలించినందుకు మామను హతమార్చిన ఘటన మండలంలోని అనంతగిరి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. హ త్యకు సంబంధించి వివరాలను ఎస్సై వినయ్‌తో కలిసి నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. చత్తీస్‌గఢ్ కు చెందిన బిలమ్సింగ్(48), కూతురు గోమతి, అల్లుడు రాజేశ్, తమ్ము డి కుమారుడు రాజేంద్రతో కలిసి బతుకుదెరువు కోసం నిజామాబాద్ జిల్లా కు వచ్చారు.
నవీపేట మండలం అనంతగిరి గ్రామంలో కొత్తగా గోదాముల నిర్మాణం కొనసాగుతుండగా కృష్ణ అనే మేస్త్రి వద్ద పనిలో చేరారు. తన భార్య మృతిచెందడంతో బిలమ్సింగ్.. కూతురు, అల్లుడి వద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా రాజేశ్, గోమతి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో భార్యను వేధింపులకు గురిచేస్తూ తరచూ ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో తన బిడ్డను మంచిగా చూసుకోవాలని, ఎందుకు వేధిస్తున్నావని బిలమ్సింగ్ అల్లుడిని నిలదీశాడు.
దీంతో మామపై కక్ష పెంచుకున్న రాజేశ్ ఈ నెల 27న మద్యం తాగివచ్చి భార్య గోమతితో ఘర్షణకు దిగాడు. తన కూతురును మళ్లీ ఎందుకు వేధిస్తున్నావంటూ రాజేశ్‌ను బిలమ్సింగ్ మందలించాడు. దీంతో రాజేశ్ తాగిన మైకంలో గోదాం ఆవరణలో నిర్మాణానికి వినియోగించే ఇటుకలతో బిలమ్సింగ్ తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. బిలమ్సింగ్ తమ్ముడి కొడుకు రాజేంద్ర ఫిర్యా దు మేరకు నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.