సిటీబ్యూరో: నగరంలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.2 వేల వరకు, కమర్షియల్ గ్యాస్ ధర రూ.3 వేల నుంచి 5 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్లు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఏజెన్సీల్లో నో స్టాక్ అంటూ చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ఏజెన్సీల ముందర సిలిండర్ల కోసం నగరవాసులు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది.
మరోవైపు హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మెస్‌లు సిలిండర్లు లేక మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వాపోయారు. చిక్కడపల్లిలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కట్టెలతోనే వంటకాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏజెన్సీల బ్లాక్ దందాను అరికట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సిలిండర్లు సరిపడా ఉన్నప్పుడు బుక్ చేసినా పది రోజుల గడిచినా ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.