విద్యానగర్, జనవరి 27 : అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని శుక్రవారం సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేస్తారని తెలిపారు. అనంతరం అడిషనల్ ఎస్పీ అన్యోన్య కంటి పరీక్షలు చేయించుకోగా, ఆయనకు కలెక్టర్ కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్, వైద్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చిరుధాన్యాల స్టాళ్లు పరిశీలన
చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టర్ జితేశ్ పాటిల్ సందర్శించారు. చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలను పరిశీలించి అభినందించారు. చిరుధాన్యాలతో ఎంతో పౌష్టికాహారం అందుతుందని, చాలా రోగాలు దరిచేరవని తెలిపారు. చిరు ధాన్యాలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పిండి వంటలు తయారు చేసినవారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారిణి రమ్య, వ్యవసాయాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.