నిజామాబాద్, మే 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 40వేల ఎకరాల్లో మక్క పంట సాగైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం దిగుబడి 12లక్షల నుంచి 14లక్షల క్వింటాళ్లు వచ్చింది. నెల రోజులు అవుతోన్న మక్క సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవడం లేదు. మక్క కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోడ్డుపైనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు ఆలస్యం వల్ల రోడ్డుపైకి వచ్చి నిరసన చేపడుతున్నారు. గత నెలలో బిచ్కుంద తహశీల్దార్ ఆఫీస్ ముందు రైతులందరూ కలిసి ఆందోళన చేశా రు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి భారీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మక్కలు పేరుకు పోయి ఉన్నాయి. కళ్లలో వత్తులు వేసుకుని రైతులు కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి అధికార యంత్రాంగం వచ్చి కొనుగోళ్లను చేపట్టడం లేదు. కనీసం రైతులను పలుకరించడం లేదు. విసిగి వేసాగుతోన్న అన్నదాతలు చేసేది లేక ప్రైవేటు వర్తకులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తోన్న మధ్యవర్తులు క్వింటాకు రూ. 1500 నుంచి రూ.1800 చెల్లించి మక్కలు కొంటున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.600 నుంచి రూ.800 నష్టం ఎదుర్కోవాల్సిన దుస్థితి రైతుకు ఏర్పడింది.
మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడాన్ని బడా వ్యాపారులు చెలరేగిపోతున్నారు. గ్రామాల్లో మధ్యవర్తుల ద్వారా మక్కల కొనుగోళ్లకు సిద్ధమై అందిన కాడికి రైతులను దోచుకుంటున్నారు. ఇష్టారీతిన తూకం వేసి అరకొరగా గిట్టుబాటు చెల్లించి ఉడాయిస్తున్నారు. బయట మార్కెట్లో ప్రైవేటు వ్యక్తులకు మక్కలు అమ్ముకుంటే ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ డబ్బులు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తద్వార వ్యాపారులకే లాభాలు వస్తున్నాయని కష్టపడి పంటలు పండించిన రైతులకు నష్టం వాటిల్లుతోందని బాధ పడుతున్నారు. మొక్కజొన్న సాగుకు ఎకరానికి భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తనాలకు రూ.2వేలు నుంచి రూ.4వేలు హైబ్రిడ్ విత్తనాలను అనుసరించి వెచ్చించాల్సి వస్తోంది. ఎరువుల కోసం రూ.8వేలు నుంచి రూ.12వేలు పెట్టుబడి అవుతోంది. ఈ మొత్తంతో యూరియా, డీపీ, పొటాష్, సూపర్ ఫాస్పేట్ కొనాల్సి వస్తోంది. కూలీలకు రూ.10వేలకు పైగానే ఖర్చవుతోంది. విత్తడం దగ్గరి నుంచి కలుపు తీత, మొక్కజొన్న కోతకు భారీగా వ్యయం అవుతోంది. పురుగు మందులు, స్పేయింగ్ కోసం అదనంగా రూ.3వేలు కలిపితే ఎకరానికి రూ.20వేలు దాటుతోంది. దిగుబడి తగ్గుతుండటం, ప్రభుత్వ కొనుగోళ్లు లేక లాభాలు రాకపోవడం వంటి కారణాలతో నష్టాల్లో కూరుకుపోతున్నారు.
తెలంగాణలో మక్కజొన్న సాగు పెరుగుతోంది. అందులోనూ కామారెడ్డి జిల్లాలో ఆశాజనకంగా విస్తరిస్తోంది. కాకపోతే ఎకరానికి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దిగుబడి పడిపోవడానికి తోడుగా కనీస మద్ధతు ధర దక్కక రెండు విధాలుగా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. సరాసరి ఎకరానికి సగటు దిగుబడి 26-30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 20క్వింటాళ్లు మాత్రమే సాధిస్తున్నారు. కనీస మద్ధతు ధర రూ.2400 ఉంది. కామారెడ్డి జిల్లాలో మొక్కజొన్నకు ప్రధాన ప్రాంతమైనప్పటికీ పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. ఎమ్మెస్పీ కంటే తక్కువగా గిట్టుబాటు ధర దక్కుతుండటంతో కర్షకులకు కన్నీళ్లు మాత్రమే మిగులుతున్నాయి. కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధరలకు మధ్యవర్తులకు అమ్ముకుని రైతులు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మొక్కజొన్న సాగుకు నోచుకున్న బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్యులే ఉన్నారు. ఇద్ధరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ రైతుల బాధలను మాత్రం వినేవారు కనిపించడం లేదు. మార్క్ఫెడ్ అధికారులైతే మక్క రైతుల గోడును వినిపించుకోవడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి లేదని చెబుతున్నారు. సర్కారు నుంచి మక్కల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదని వివరిస్తున్నారు.
పెద్ద కొడప్గల్ సొసైటీకి మక్కలు తెచ్చి వారంరోజులైంది. మక్కలు చెన్నీ పట్టాం. కానీ కాంటా చేస్తలేరు. రేపు మోపు లారీలు వస్తాయంటూ చెబుతున్నారు. వారం రోజుల నుంచి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నాం. పొద్దంతా ఎండకు తట్టుకోలేక, తిండిలేక ఇక్కడే ఉంటున్నాం. అకాల వర్షాలకు మక్కలు తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు తొందరగా కాంటా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
-పోక్లే నారాయణ, రైతు, విఠల్వాడి గ్రామం, పెద్ద కొడప్గల్ మండలం
మక్కలు కేంద్రానికి తెచ్చి వారం రోజులైంది. కాంటా చేస్తలేరు. కాంటా చేసినవి సమయానికి తీసుకెళ్తలేరు. లారీలు వస్తలేవని, రేటు పెంచి ఇస్తే లారీలు వస్తాయంటున్నారు. కాంటా చేస్తారని పొద్దంతా ఎండలో ఎదురుచూ స్తున్నాం. రాత్రి ఇక్కడే కాపలాగా ఉంటున్నాం. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోతున్నది. దీంతో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు త్వరగా కాంటా చేయించాలని కోరుతున్నాం.
-పండరి రెడ్డి, రైతు, విఠల్వాడి, పెద్ద కొడప్గల్ మండలం