భిక్కనూరు,అక్టోబర్ 28: మండలంలోని బస్వాపూర్ సింగిల్ విండో ఇన్చార్జి చైర్మన్‌గా మద్దిస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత చైర్మన్ కిష్టాగౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో అధికార పార్టీ నేతలు ‘విండో విభజన’ పేరిట కుటిల రాజకీయాలకు పాల్పడ్డారు. చైర్మన్లను పర్సన్ ఇన్‌చార్జీలుగా నియ మిస్తూ అడ్డదారిలో ఉత్తర్వులు తీసుకువచ్చారు.
దీనిపై విండో పాలకవర్గ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం విండో విభజనతోపాటు పర్సన్ ఇన్చార్జీల నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బస్వాపూర్ సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న కిష్టాగౌడ్‌ను పదవి నుంచి తొలగిస్తూ డీసీవో రామ్మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కిష్టాగౌడ్పై అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించడంతోపాటు తిరిగి సింగిల్ విండో ఎన్నికలు నిర్వహించే వరకు వైస్‌చైర్మన్‌గా ఉన్న మద్ది స్వామి ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని సీఈవో మహేశ్వరి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు మద్దిస్వామి సోమవారం విండో ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా.. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. బాణాసంచాలు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మండలంలోని విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.