వినాయక్‌నగర్, జూలై 3: నిజామాబాద్ నగరంలోని గంజ్ ప్రాంతంలో రైల్వేగేటును ఓ లారీ ఢీకొట్టగా, రైల్వే గేటు ఓ సైడ్ విరిగి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. లారీ ఢీకొని రైల్వేగేటు విద్యుత్ తీగలపై పడిన విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న గేట్‌మన్ వెంటనే రైల్వే అధికారులకు చెప్పాడు.
దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఆ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేసింది. పోలీసులు చేరుకొని వాహనాలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రైల్వే గేట్‌మన్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పట్టుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.