వినాయక్‌నగర్, డిసెంబర్ 12 : కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక అని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంతోపాటు ఆర్మూర్, బోధన్ కోర్టుల ఆవరణలో ఈ నెల 14న జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మొత్తం 13 లోక్‌అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. లోక్‌అదాలత్ ను విజయంతం చేయడానికి పౌరసమాజం సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ దావాలు రాజీ పద్ధతిలో ఇరుపక్షాలు పరిష్కరించుకోవడానికి చట్టం అనుమతినిస్తున్నదని తెలిపారు.
చెక్ బౌన్స్ కేసులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల కేసులు, గృహహింస, మెయింటెనెన్స్ కేసులు రాజీ చేసుకోవడం ద్వారా ఇరువర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూరడంతోపాటు సమయం ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకున్న అన్ని రకాల కేసులకు శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ అవార్డులను జారీ చేస్తామని, ఇవి పైకోర్టుల్లో అప్పీలుకు వీలు లేనివని స్పష్టంచేశారు.