బిచ్కుంద, సెప్టెంబర్ 20: పిల్లల కిడ్నాప్‌కు యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సాత్విక్, నాందేవ్ చదువుతున్నారు. స్కూల్లో బాత్రూంలు సరిగా లేకపోవడంతో.. ఇంటర్వెల్ సమయంలో బహిర్భూమికని ఇంటికి వెళ్లేందుకు బడి నుంచి బయటికి వచ్చారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ జంట.. ఎక్కడకు వెళ్తున్నారని వారితో మాట కలిపారు. వారి ప్రవర్తనను అనుమానించిన విద్యార్థులు పరుగెత్తగా వెంబడించారు.
కొద్దిదూరం వెళ్లాక విద్యార్థులు అక్కడ కనిపించిన వారికి విషయం చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా పొగై అనుమానితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పురుషుడ్ని స్తంభానికి కట్టేసి కొట్టగా, మహిళను స్త్రీలు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిళ, పురుషుడు ఓ మేస్త్రీ వద్ద పని చేస్తారని, తాగిన మైకంలో ఉన్న ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.