రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. మొదటి, రెండు, మూడు విడుతల్లోనూ ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు బ్యాంకులు, రైతువేదికల వద్ద ఉన్న అధికారులను సంప్రదించగా.. వారి నుంచి ససమాధానం కరువైంది. కొందరు అధికారులు త్వరలో వస్తదని, మరికొందరు ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని చెప్పడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. రుణమాఫీపై ఇంతవరకూ స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.
నాకు ఎకరం 6 గుంటల భూమి ఉండగా.. 2018లో రూ. 69 వేలు క్రాప్‌లోన్ తీసుకున్నా. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా కానీ నాకురుణమాఫీ కాలేదు. మూడో విడుతలో కూడా నా పేరులేదు. అధికారులనడిగితే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.
– అక్కమ్మ సాయిబోయి, రైతు, కల్లూర్ , పొతంగల్ మండలం
గతేడాది జూన్‌లో ఎత్తొండ బ్యాంకులో లక్షా ఐదు వేల రూపాయల రుణం తీసుకున్నా. ప్రభుత్వం మూడు విడుతల్లో ఇచ్చిన లిస్టుల్లో మాత్రం నా పేరు లేదు. అధికారులకు అడిగితే వస్తది.. వస్తది అని చెబుతున్నారు. నెల రోజుల నుంచి మాఫీ కోసం ఎదురుచూస్తున్నా. మాఫీ ఎందుకు కాలేదో అర్థం కావడం లేదు.
– చిక్లే రాజేశ్వర్, రైతు , టాక్లీ, ఉమ్మడి కోటగిరి మండలం
నాకు నాలుగున్నర ఎకరాల పొలం ఉండగా.. నేను బ్యాంకులో రెండు లక్షల పైన అప్పు తీసుకున్నా. కానీ రుణ మాఫీ లిస్టులో ఇప్పటివరకు నా పేరు రాలేదు. అసలు ఎం జరుగుతుందో ఏమో అర్థం అయితలేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం మాకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి.
– ముత్తయ్య, రైతు, దోంచంద, ఏర్గట్ల మండలం
కోటగిరి, ఆగస్టు 19 : ఎత్తొండ గ్రామీణ బ్యాంకులో రూ. లక్షా ఐదువేల క్రాప్ లోన్ తీసుకున్నా. అన్ని పత్రాల్లో పేర్లు సరిగ్గా ఉన్నా నాకు రుణమాఫీ కాలేదు. వ్యవసాయాధికారికి, బ్యాంకులో అడిగితే ఎలాంటి సమాధానమూ లేదు. గతంలో రూ.95 వేలు కేసీఆర్ సర్కారు మాఫీ చేసింది.
– దివిటే బల్వంత్‌రావు, రైతు, టాక్లి