నిజామాబాద్, డిసెంబర్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారంతా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తుండగా… ఇందులో మద్యం కీలకంగా మారుతోంది. వైన్ షాపులు తెరవడమే తరువాయి అన్నట్లుగా ఉదయం 10గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10గంటల వరకు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావడంతో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారికి ఈ ఎన్నికలు హుషారెత్తిస్తున్నాయి.
ఇదే అదనుగా భావిస్తోన్న వ్యాపారులు అడ్డదారుల్లో విక్రయాలు ప్రోత్సహిస్తున్నారు. పెద్ద ఎత్తున రూ.లక్షలు విలువ చేసే మద్యాన్ని బెల్టు షాపులకు రాత్రి, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. స్థానికంగా పోలీసులను మామూళ్ల మత్తులో ముంచెత్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. బెల్టు షాపుల నుంచి ఓటర్ల చెంతకు సులువుగా చేరుతున్నాయి. వ్యక్తిగత అమ్మకాల కంటే ఎక్కువగా గంపగుత్తగా మద్యం కాటన్లు అమ్మకాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. కాటన్లు కొద్దీ కొనుక్కుని వెళ్తున్న వ్యక్తులంతా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి అప్పగిస్తున్నారు.
ప్రోత్సహిస్తోన్న ఆబ్కారీ శాఖ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బెల్డు షాపుల ద్వారా మద్యం అక్రమ అమ్మకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడి క్రయ, విక్రయాలతో ఉభయ జిల్లాల్లోని పల్లెలు మద్యంతో గుప్పు మంటోంది. మద్యం దుకాణాల సంఖ్య మండలానికి ఒకటి నుంచి సరాసరి రెండు, మూడు దుకాణాల వరకున్నాయి. బెల్టు దుకాణాలు మాత్రం అందుకు రెట్టింపు స్థాయిలో విస్తరించాయి. మద్యం బాటిల్ ధరకు 10 నుంచి 15శాతం మేర అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పల్లెల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటవ్వగా ఆబ్కారీ శాఖ పట్టించుకోవడం లేదు. నెలవారీగా మామూళ్లు వస్తుండటంతోనే ఇదంతా చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బెల్టు షాపులు పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. డంపింగ్ కేంద్రాలుగా బెల్టు షాపులు మారిపోవడంతో అడ్డూ అదుపు లేకుండా పంపిణీ జరుగుతోంది. అమ్మకాల టార్గెట్‌తో పాటుగా స్థానికంగా రాజకీయ నేతలతో చేతులు కలిపి ఆబ్కారీ శాఖనే తెర వెనుక ప్రోత్సహిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాటల్లోనే నియంత్రణ…?
ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ రకమైన వ్యవహారాలను ఉపేక్షించబోమని జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. నిఘా బృందాలు మోహరించినప్పటికీ అవేవి మద్యాన్ని పట్టుకున్న దాఖలాలే లేవు. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 కంటే ఎక్కువే బెల్టు షాపులు ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం డంప్ అయ్యింది. ఐఎంఎల్ డిపో నుంచి బయటకు వచ్చిన మద్యం వివరాలు పరిశీలిస్తే గతం కంటే ఎక్కువగా ఈ వారం రోజుల్లో మద్యం విక్రయాలు జరిగాయి. ఇండెంట్ ఇచ్చిన మద్యం దుకాణాల ఆధారంగా తనిఖీలు చేపడితే మద్యం నియంత్రణ సులువు అవుతుంది.
ఇలాంటి ప్రక్రియను చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మద్యం దుకాణాల వద్ద నిబంధనల మేరకు సీసీటీవీ కెమెరాలు బిగించారు. ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసిన వారిపై నిఘా పెడితే ఇట్టే డంప్‌లు స్వాధీనం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ పోలీసులు, ఎన్నికల పర్యవేక్షక బృందాలు చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తోంది. వారం రోజులుగా మద్యం బాటిళ్ల పంపిణీ విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నప్పటికీ పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఎన్నికలను ప్రభావితం చేసే చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులతో పాటుగా ఎన్నికల విధుల్లో ఉన్న వారికి చిత్తశుద్ధి అన్నదే లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారుల గుండా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారి వాహనాలను నిలిపి తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోన్న బృందాలకు మద్య ప్రవాహం కనిపించకపోవడం విడ్డూరంగా మారింది.