రాజంపేట్, జూన్ 20: మద్యపాన నిషేధంలో మండలంలోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకున్న గుండారం గ్రామ పరిధిలోని గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమితండా గ్రామాలు తాజాగా మద్యపాన నిషేధం విధించాయి.
ఈ మేరకు గ్రామస్తులు శుక్రవారం గుండారం ఎల్లమ్మ గుడి వద్ద సమావేశమై మద్యపానం నిషేధిస్తూ తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానాతోపాటు ఏడు చెప్పు దెబ్బలు విధించనున్నట్లు తీర్మానించారు. మద్యం విక్రయించే వారిని పట్టించిన వారికి రూ. 20వేల నగదు బహుమతి అందిస్తామని, దొంగతనంగా మద్యం కొని తాగితే ఏడు చెప్పు దెబ్బలు ఉంటాయని తీర్మానంలో పేర్కొన్నారు.
గ్రామాల్లో యువత మద్యానికి బానిసై ప్రమాదాలకు గురవుతున్నారని, అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యపాన నిషేధం అమలుతీరును పర్యవేక్షిం చేందుకు గ్రామానికి ఇద్దరి చొప్పున తీసుకొని కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.