బోధన్, జనవరి 21: పాతికేండ్లుగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్రంలోనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అతి పెద్ద కంటి దవాఖానగా పేరుపొందిన బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి దవాఖాన యాజమాన్యం బోధన్ డివిజన్ ప్రజలకు ఈ నెల 23న శుక్రవారం నుంచి లయన్స్ జనరల్ దవాఖాన ద్వారా సేవలను అందించనున్నది. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ దవాఖానను అత్యాధునిక సౌకర్యాలు, అన్ని హంగులతో కూడిన నూతన భవనంలో ఏర్పాటుచేశారు. ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా రోగులకు డయాగ్నొసిస్ సేవలు, అనేక రోగాలకు వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. 20 పడకలతో ఈ దవాఖానాను ఏర్పాటుచేశారు.
ఐదు బెడ్లతో కూడిన అత్యాధునిక ఐసీయూ, నాలుగు బెడ్లతో కూడిన క్యాజువాలిటీ ఆ దవాఖాన ప్రత్యేకతలు కాగా పురుషులు, మహిళలకు వేర్వేరుగా జనరల్ వార్డులను ఏర్పాటుచేశారు. 24 గంటలపాటు ఈ ఆస్పత్రిలో వైద్య సేవలను అందించనున్నారు. వైద్య చికిత్సల కోసం ఇద్దరు ఎండీ ఫిజిషియన్లు, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు విధులు నిర్వహించనున్నారు. ల్యాబ్, ఫార్మసీ, ఎక్స్‌రే తదితర విభాగాలు ఉన్నాయి. కేవలం రూ.100 వోపీతో రోగులకు వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. కాగా ఈ దవాఖానను రేపు(శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అతిథులుగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, లయన్స్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జి.బాబూరావు, లయన్స్ మల్టీఫుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్రావు తదితరులు పాల్గొంటారు.
పేద రోగులకు వైద్యం అందించాలన్న తపనతో..
25 సంవత్సరాలుగా జిల్లాలోని కంటి రోగులకు వైద్య సేవలు అందింస్తున్నాం. బోధన్‌తోపాటు నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడల్లో కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి దవాఖానలను ఏర్పాటుచేశాం. ఈ స్ఫూర్తితో ఇతరత్రా రోగాలకు కూడా సామాన్యులు, పేదలకు వైద్య సేవలు అందించాలన్న తపనతో ఈ జనరల్ దవాఖానను ఏర్పాటుచేస్తున్నాం. ఇక్కడ నామమాత్రపు ఫీజుతో 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తాం.
-పోలవరపు బసవేశ్వరరావు, లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు