ఇందల్వాయి: ప్రజల కోసం రూపొందించుకున్న చట్టాలు ప్రజల భాషలో తెలియజేయడానికి ‘పాన్ ఇండియా అవగాహన కార్యక్రమ ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తెలిపారు. ఇందల్వాయి, ఇందల్వాయి తండా గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ‘పాన్ ఇండియా’ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వలస పాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించుకుని, రాజ్యాంగానుసారం చట్టాలు తయారుచేసుకుని అమలు చేసుకుంటున్నామన్నారు. ఇంగ్లీష్ భాషలోని చట్టాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా కరపత్రాలు, చిన్నచిన్న పుస్తకాలను ముద్రింపజేసి పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
చట్టాలను ప్రజలందరికి చేర్చడం, న్యాయసేవలు అందించడం, చట్టాలు సమకూరే సమస్త ప్రయోజనాలు ప్రజల ప్రగతికేనని అన్నారు. చట్టాలు తెలుసుకుని చట్టబద్ధ నడవడికను అలవర్చుకుని పయనింపజేయడమే న్యాయ సేవా సంస్థ చూపుతున్న న్యాయమార్గమని తెలిపారు. టీమ్ లీడర్ సంస్థ ప్యానల్ న్యాయవాది దాసరి పుష్యమిత్ర మాట్లాడుతూ లోక్అదాలత్ల ద్వారా న్యాయార్థులకు త్వరితగతిన న్యాయ సేవలందిస్తున్నారని తెలిపారు.
ప్రతి గ్రామం, తండాలలో పాన్ ఇండియా ప్రచార రెపరెపలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమాల్లో ఇందల్వాయి సర్పంచ్ సత్తవ్వ, ఇందల్వాయి తండా సర్పంచ్ విస్లవత్ చందర్, పంచాయతీ కార్యదర్శి అరుణ, ప్యానల్ న్యాయవాదులు గాలిపల్లి వెంకటేశ్వర్, ఆశనారాయణ, ఇందూరు యువత సాయిబాబు,గ్రామపెద్దలు అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సై భానుమతి తదితరులు పాల్గొన్నారు.