వినాయక్ నగర్ : నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలను అదుపు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే (MLA) ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) కోరారు. నిజామాబాదు జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి సాయి చైతన్యను ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో లా అండ్ ఆర్డర్( Law and Order) అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని కోరారు. మాదకద్రవ్యల పైన పోలీస్ వారు కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఆటో, బైక్ దొంగతనాలు అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోని, సామాన్య ప్రజలకు అండగా నిలవాలని కోరారు. పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు .