మాచారెడ్డి, ఏప్రిల్ 12: మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తించారు. దీంతో అటవీశాఖ పరిధిలో ఉన్న ఆయా గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. ఆరు నెలల క్రితం గోదావరి నది దాటి జగిత్యాల మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. అటు నుంచి కామారెడ్డి జిల్లాలోకి చేరుకున్నది. ఆపై రాజన్న సిరిసిల్లా జిల్లా మీదుగా సిద్దిపేట వైపునకు వెళ్లి తిరిగి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్‌లోకి మూడు రోజుల క్రితం ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. పులి కోసం ట్రాప్ కెమెరాలను బిగించినట్లు మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి మజారొద్దీన్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అడవులు పక్కపక్కనే ఉండడంతో రెండు జిల్లాల్లో పులి ఎక్కడైనా ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ఎల్లంపేట గ్రామంలో అటవీశాఖ అధికారులు ప్రజా హెచ్చరిక జారీ చేశారు. పెద్దపులి సంచారంపై గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు ఆదివారంఅవగాహన కల్పించారు. పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులి సమాచారం తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అటవీ ప్రాం తంలో పొలాలు ఉన్న రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూ చించారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల వద్ద పశువులను కట్టేయవద్దన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు సూచించారు.