ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 30 : వివిధ భూసమస్యలు సుస్థిర అధికోత్పత్తిని సాధించకుండా ఆటంకపరుస్తున్నాయి. కింద సూచించిన యాజమాన్య పద్ధతుల ద్వారా ఇటువంటి సమస్యలను అధిగమించి సుస్థిరమైన అధిక దిగుబడులను సాధించవచ్చు.
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు
వీటిలో ఇసుకశాతం అధికంగా ఉండడంతో పాటు బంకమన్ను 20శాతం కన్నా తక్కువ గా ఉంటుంది. ఈ నేలల్లో దిగుబడిని పెంచడానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువుమట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలాలి. చెరువుమట్టిలో పెద్ద పెల్లలను పగులగొట్టి చేను మొత్తంగా పలుచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుకనేలల్లో చెరువుమట్టిని తోలిన తర్వాత 200 కిలోల బరువు గల రోలర్‌ను 5-6 సార్లు తిప్పాలి. చెరువుమట్టిని వేయడంతో భూమిలో బంకమన్నుశాతం పెరుగుతుంది. భూమికి నీటిని, పోషకపదార్థాలను నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున వర్షాకాలానికి ఒక నెల ముందుగానే చేనుపై పలుచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. పై వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తరువాత అలాగే గాలికి వదిలివేయకుండావెంటనే చేనులో కలియదున్నడం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా వాడవచ్చును.
అడుగుమట్టిలో గట్టిపొర
ఈ సమస్యను తేలికగా గుర్తించవచ్చు. ఒక మీటరు వెడల్పు, పొడవు, లోతు గల గొయ్యి ని తవ్వి చూస్తే భూమి లోపల గట్టి పొర కనబడుతుంది. గట్టి పొరకు పైన కింద మాము లు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్నచోట చాకుకు గట్టిగా తగులుతుంది. ఇటువంటి సమస్య నిజామాబాద్ చెరువుల కింద పండించే రేగడిభూముల్లో ఎక్కువగా ఉంటుంది. పెద్ద ట్రాక్టర్‌తో లోతుగా దున్నే నాగళ్లతో లేదా సబ్ సాయిలర్ లేదా చిసెల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ లోతు సాళ్లను 60 సెం.మీ. దూరంలో రెండు వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం కూడా వేస్తే 10-12 శాతం వరకు అధికంగా చెరుకు దిగుబడిని పెంచవచ్చు. లోతు దుక్కి ప్రభావం మూడు సంవత్సరాల వరకు ఉంటుంది.
మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్య
మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య. వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెల్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు (విత్తిన గింజలు) సరిగ్గా మొలకెత్తదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తరువాత ట్రాక్టర్‌తో నడిచే తిరుగు దంతె (రోటోవేటర్) లేదా పళ్ల దంతెతో తేలికగా దున్నితే పెద్దపెల్లలు పగిలి ఆరుతడి పంటలకు అనువైన దుక్కి వస్తుంది. దీని వల్ల వేరుశనగెలో అధిక దిగుబడి సాధించవచ్చు. వరి కోసిన తరువాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతితో దుక్కి చేయడం ఎంతో శ్రేయస్కరం.
సేంద్రియ ఎరువులతో దిగుబడిని పెంచవచ్చు
నేలలోతు తక్కువగా ఉండడం వలన (30 సెం.మీ. కన్న తక్కువ) వేరు పెరుగుదల తగ్గడమే కాకుండా నీరు, భూసారం పరిమితంగా ఉండడంతో పంట దిగుబడి తగ్గు తుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నాగళ్లతో లేదా ‘బండ్ఫార్మర్’ లేదా పారలతో నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. ఒక మీటర్ దూరంలో లోతుగా మూడు సంవత్సరాల కొకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువు వేసి దిగుబడిని పెంచవచ్చు.
-గాటాడి సంతోష్‌కుమార్, ఎల్లారెడ్డి వ్యవసాయాధికారి