శక్కర్ నగర్ (బోధన్) : వివిధ కార్పొరేషన్ల ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకం కింద అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ ( Land registration ) చేయించాలని మాల మహానాడు (Malamahanadu) జిల్లా అధ్యక్షుడు, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ (Former Chairman) ఆనంపల్లి ఎల్లయ్య (Yellaiah) డిమాండ్ చేశారు.
శనివారం బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలువురు లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. 1994 సంవత్సరం నుంచి మూడు దఫాలుగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ (NSF) కూలీలుగా పనిచేసిన పలువురితో పాటు, అర్హులైన నిరుపేదలకు సుమారు 6,000 ఎకరాలను పంపిణీ చేశారని అన్నారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను ఆయా కార్పొరేషన్ల ద్వారా బోర్ పంపిణీ పథకం కింద ఎకరాకు రూ. 5వేలు చొప్పున చెల్లించి వారికి రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. కొందరు నిరుపేదలు అనివార్య కారణాలవల్ల తాము సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారని అన్నారు. కొందరి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ భూములను ఇతరులకు అమ్ముకున్నారని, సుమారు ఏడాదికాలంగా ఈ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో సదరు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పంపిణీ చేసిన భూములను, సాగు చేసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కొంతమంది హైకోర్టును ఆశ్రయించి సుమారు 40 నుంచి 50 వేల రూపాయల ఖర్చు చేసి ఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని వివరించారు. దీంతో నిరుపేదలు డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి నిరుపేదలకు కేటాయించిన భూములను ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా మిగిలిన వారితో సమస్య పరిష్కారానికి ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల నాయకుడు మిర్జాపూర్ సాయన్న, భూ పంపిణీ బాధితులు అబ్బయ్య, సంభాని ప్రసాద్, పరిమి రాము, ఎం బాలరాజ్ తదితరులు ఉన్నారు.