Suicide | వినాయక నగర్, జనవరి 2 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతంలోని బాచేగావ్ కు చెందిన ఓంకార్ (24) అనే యువకుడు మూడేళ్ల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి నిజామాబాద్ నగరానికి వచ్చి స్థానిక బొబ్బిలి వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
ఇక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే యువకుడు గురువారం రాత్రి అదే ఆసుపత్రిలో నైట్ డ్యూటీ ఉండడంతో ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి బాత్రూంలో కిటికీకి ఉరి వేసుకొని ఓంకార్ అగుపించడంతో ఆస్పత్రి సిబ్బంది యజమానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలు మార్చురీకి తరలించారు.
యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అసలు తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని తల్లిదండ్రులు వాపోయారు. మృతుడి తండ్రి సాహెబ్ రావు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.