Former MLA Jeevan Reddy | హైదరాబాద్, నవంబర్ 21 : ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికీ కేటీఆర్ కడిగిన ముత్యమని, ఇది కాలం చెప్పే సత్యమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్ర వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫార్ములా ఈ రేస్ కేసు పేరుకేనని, అసలు కాంగ్రెస్, బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ ‘కారు’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘ఫార్ములా ఈ రేస్’ అనే అభూత కల్పిత సీరియల్ ను సృష్టించారని ఆయన చెప్పారు. మొగలిరేకులు, కార్తీకదీపం సీరియల్స్ లాగా సాగదీస్తూ బీఆర్ఎస్ను దెబ్బకొట్టే కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రమేష్ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ పై కేసు రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ కు నిదర్శనమని, పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు.
కేటీఆర్ పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయ తతంగం చేశారని, ఇది కాంగ్రెస్, బీజేపీల మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్ని సార్లు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసురాని గవర్నర్, బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్ధులను అణచి వేసే కేసులకు మాత్రం ఆగ మేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ పై కేసు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్ నిఖార్సయిన ఉద్యమకారుడన్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం కదం తొక్కిన ప్రజాక్షేత్రంలో కేటీఆర్ ను మిస్టర్ క్లీన్ గా ఆయన అభివర్ణించారు.
కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని ఆయన అన్నారు. రేవంత్ లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ అరపైసా అవినీతికి పాల్పడలేదని జీవన్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ పైసా తీసుకోనప్పుడు ఇక అవినీతికి ఆస్కారమెక్కడిది..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ లో కేటీఆర్ పై కేసు రేవంత్ కక్ష సాధింపుకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై తప్పుడు కేసు పెట్టడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ,కాంగ్రెస్ అంటేనే చీటర్స్ అని ఆయన అన్నారు.
ఉద్యమ నేతలపైనే అణచివేతలా..? అరెస్టులకు భయపడేది లేదు.
ఉద్యమ కాలంలో పెద్ద బాబులనే తరిమికొట్టామని గుర్తు చేశారు. ఈ చిన్నబాబులు తమకొక లెక్కా అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందడానికి కేసీఆర్ ఫ్యామిలీ తో గోక్కున్నావని, నీకూ వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లకు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా మిగిలిపోతారని, ఇక భవిష్యత్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశమే లేదని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా కేటీఆర్ కడిగిన ముత్యంలా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారని ఆయన తెలిపారు.
ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టీకాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రతిపక్షం లో ప్రతిక్షణం ప్రజల కోసమే పని చేస్తుండటమే రేవంత్ పగకు కారణమని, ఒక్క రోజైనా కేటీఆర్ ను జైల్లో పెట్టి మానసికానందం పొందాలని రేవంత్ తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. కే టీ ఆర్ మంత్రిగా ఉన్నప్పట్నుంచే ఆయన పై రేవంత్ రకరకాలుగా బద్నామ్ చేసే ప్రయత్నం చేశారని, తాను చేసే పాడు పనులు కేటీఆర్ కు ఆపాదించి రేవంత్ రాక్షసానందం పొందాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ల రేసు తో కే టీ ఆర్ అంతర్జాతీయం గా హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చారన్నారు.
ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా పెరగడానికి కేటీఆరే కారణమన్నారు. కేటీఆర్ జీడీపీ పెంచితే రేవంత్ గుండాయిజం పెంచారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ తలసరి ఆదాయం పెంచితే రేవంత్ తన సొంత ఆదాయం పెంచుకున్నారని విమర్శించారు. ఫార్ములా వన్ లో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎం లు జైలు కు పోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ తెలంగాణ లో చేసింది ఎంతో మంది సీఎం లు తమ రాష్ట్రాల్లో చేశారని ఆయన గుర్తు చేశారు. ఫార్ములా వన్ తో కేటీఆర్ పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డి అందాల పోటీలతో రాష్టం పరువును అంగట్లో పెట్టి అమ్మారని విమర్శించారు. లోకేష్ ఏపీకి ప్రస్తుతం గూగుల్ తెస్తే కేసీఆర్ హైదరాబాద్ కు ఎపుడో తెచ్చారని జీవన్ రెడ్డి చెప్పారు.