నిజామాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ నేతృత్వంలో నిర్వహించే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యనాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు వివిధ హోదాల్లో ఉన్నవారందరూ హాజరుకానున్నారు. సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షతోపాటు భవిష్యత్తు కార్యాచరణ, పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించనున్న పార్టీ విధి విధానాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక బొక్కా బోర్లపడుతున్నది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తీరు, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్లో కనిపిస్తున్న అహంభావ ధోరణి, నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టనున్నారు.
ఓటమిపై సమీక్ష…
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తోంది. సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా దుర్భాషలాడడం, ప్రభుత్వ వేదికలను రాజకీయ వేదికలుగా మార్చడం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ వాగ్బాణాలు సంధించనున్నారు. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడంతోపాటు అధికార పార్టీ తీరును ఎండగట్టే వ్యూహాలను వివరించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. ఉద్యమ కాలం నుంచి స్వరాష్ట్రంలోనూ ప్రజలు కేసీఆర్కు జై కొట్టారు. అనూహ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. అసంబద్ధ హామీలు, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలంతా జనాలను నమ్మించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాట దాటవేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటను చెప్పినట్లుగా అమలుచేసి చూపించింది. అంతేకాకుండా మ్యానిఫెస్టోలో పేర్కొనని హామీలను సైతం అమలుచేసింది. గడప గడపకూ కేసీఆర్ పథకాలను తీసుకువెళ్లింది. కామారెడ్డిని జిల్లాగా మార్చడం, పట్టణ అభివృద్ధి, వైద్య కళాశాల మంజూరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి.ఈ పరిణామాలపై కేటీఆర్ సమీక్షించి, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతోనూ భేటీ కానున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలను కేటీఆర్ విశదీకరిస్తారు.
విజయావకాశాలపై వ్యూహరచన
అసెంబ్లీ ఎన్నికల అనంతరం కామారెడ్డి నియోజకవర్గంలో నేడు నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కేటీఆర్ హాజరవుతున్న తొలి భేటీ ఈ నియోజకవర్గమే కావడం విశేషం. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలను రచించనున్నారు. ఇప్పటికే జనవరి 8న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై తెలంగాణ భవన్లో సమీక్ష పూర్తయ్యింది. అంతర్గతంగా నిర్వహించిన ఈ సమావేశంలో లోటుపాట్లపై చర్చించారు. పార్టీలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై అంచనాకు వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయి సమావేశాలకు కేటీఆర్ హాజరవుతున్నారు. ఇందులోభాగంగా కామారెడ్డి పట్టణంలోని సత్యా గార్డెన్లో నిర్వహించనున్న కేటీఆర్ సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద యం 11గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా..మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్తో పాటు కీలక నేతలు హాజరుకానున్నారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ కొద్దిరోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు కొండంత అండగా నిలవడం ఖాయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం కార్యకర్తలకు భరోసాను కల్పిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సంస్థాగతంగా బలోపేతంగా ఉన్న పార్టీని అజేయ శక్తిగా నిలబెట్టేందుకు ప్రతి గులాబీ సైనికుడు సిద్ధంగా ఉన్నాడు.