నిజామాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డిలో కేసీఆర్ నినాదం హోరెత్తుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా గులాబీ అధినేత ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలంతా కేసీఆర్‌కు సాదరంగా స్వాగతం పలుకుతుండగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు షురూ అయ్యింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న పలు కుల సంఘాలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామంటూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటున్నాయి. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఈ మేరకు హోలియా దాసరి, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారంతా గురువాం ర్యాలీ తీశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న కేసీఆర్‌కే తామంతా మద్దతుగా ఉంటామంటూ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని తమ కుల సంఘం తరపున రాతపూర్వకంగా స్థానిక సర్పంచ్‌కు అందించారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని కొత్త పుంతలు తొక్కించిన కేసీఆర్‌కు తామంతా ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం, పింఛన్లు అందివ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా వంటి నిర్ణయాలతో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వారు చెబుతున్నారు.
గర్గుల్‌లో స్వచ్ఛంద మద్దతు…
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గర్గుల్ గ్రామస్తులంతా పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపాటలకు క్షీరాభిషేకంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పడంపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డికి కొత్త రూపును తీసుకువచ్చిన కేసీఆర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందితే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్‌కే ఓటేస్తామంటూ శపథం పూనుతున్నారు. గర్గుల్ గ్రామస్తులంతా ఊర్లో ర్యాలీ తీసి కేసీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై కేసీఆర్… జై బీఆర్ఎస్ అంటూ నినదించారు. గర్గుల్ గ్రామస్తుల నిర్ణయంతో కామారెడ్డి నియోజకవర్గం అంతటా ఒకే చర్చ జరుగుతున్నది. ఇదే తీరులో మిగిలిన ప్రాంతాల్లోనూ కుల సంఘాల బాధ్యులంతా కేసీఆర్‌కు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. గర్గుల్ ప్రజలు చూపిన బాటలో మరిన్ని పల్లెలు సైతం కదిలి రాబోతున్నాయి.
కాంగ్రెస్ కకావికలం…
అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే కాంగ్రెస్ పార్టీ కకావికలం అవుతున్నది. మరీ ముఖ్యంగా కామారెడ్డిలో ఆగమాగమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో నిలుస్తున్నట్లుగా ప్రకటించిన వెంటనే మాజీ మంత్రి షబ్బీర్ అలీకి భయం పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో తిమ్మిని బమ్మిని చేసైనా గెలుపొందాలని భావించిన షబ్బీర్‌కు కేసీఆర్ చేసిన ప్రకటన మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించడంతో శ్రేణులు డీలా పడి పోయారు. వారందరినీ తనతో పాటే కాపాడుకోవడం కోసం షబ్బీర్ అలీ ఆపసోపాలు పడుతున్నట్లుగా తెలుస్తున్నది. కేసీఆర్‌పై పోటీ చేయడం కన్నా మిన్నకుండి పోవడం మిన్న అన్నట్లుగా హస్తం పార్టీ శ్రేణులే స్వయంగా షబ్బీర్ అలీకి ఉచిత సలహాలు అందిస్తుండడంతో మాజీ మంత్రికి ఏమీ అంతు చిక్కడం లేదు. ఇందులో భాగంగానే నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన షబ్బీర్ అలీ కాలంలో కారు చీకట్లలో తెలంగాణ ప్రజలు బతికారు. అలాంటి దుస్థితిని మర్చిపోయి ఉచిత విద్యుత్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. 24గంటల కరెంట్ ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కల్లబొల్లి మాటలతో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు పాకులాడుతోందని సోషల్ మీడియాలోనూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
హస్తం పార్టీపై జనంలో భయాలు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో గడిచిన తొమ్మిదేండ్లలో సాధించని ప్రగతి అంటూ ఏదీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం కొంగొత్తగా దూసుకుపోతున్నది. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నెముకగా నిలుస్తున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. 24గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారు. పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. రైతుబంధు సాయం అందుతున్నది. వ్యవసాయం పండుగలా సాగుతుంది. కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతున్న రైతుల్లో ఒక్కసారిగా కాంగ్రెస్ పుట్టించిన కరెంట్ మంటలు ఇంకా చల్లారడం లేదు. 24గంటల కరెంట్ కావాలి. మూడు పంటలు పండాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ మాకొద్దు అంటూ రైతులు మండిపడుతున్నారు. రైతులకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ పార్టీ తమకు వద్దంటూ రైతువేదికలు, రచ్చబండల్లో రైతులంతా ఇదే చర్చించుకుంటున్నారు.
గత కాలపు పీడ దినాలను గుర్తుకు తెచ్చుకుంటూ బాబోయ్ కాంగ్రెస్సా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. వారికి అధికారం చిక్కితే దోచుకోవడం తప్ప ప్రజలను బాగు చేసుడు ఉండదని రైతులంతా అభిప్రాయపడుతున్నారు. సాగుకు నిరంతర విద్యుత్ కావాలంటే రైతుకు చేదోడు వాదోడుగా నిలిచే కేసీఆర్‌తోనే సాధ్యమని చెబుతున్నారు. రైతు బంధువు కేసీఆర్ మన గుండెల్లో ఉండాలంటూ తెలంగాణ వ్యాప్తంగా రైతులు నినదిస్తున్నారు. కామారెడ్డిలోనూ ఈ తరహా ప్రచారం ఊపందుకుంటున్నది.