పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపు లభించింది. కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మేడే కానుకగా కార్మికులకు తీపి కబురును అందించారు. ఒక్కో కార్మికుడికి రూ. వెయ్యి చొప్పున పెంచుతూ నిర్ణయించారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు పదివేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. అడగకముందే వేతనాలు పెంచడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని మరో సారి రుజువు అయ్యిందని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దోమకొండ/కమ్మర్పల్లి, మే 1: పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురును అందించారు. మేడే కానుకగా వెయ్యి రూపాయల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ శ్రమను గుర్తించడంపై పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులకు పెరిగిన వేతనం వర్తించనుంది. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామపంచాయతీలతోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో 3156 మంది, మున్సిపాలిటీల్లో 530.. మొత్తం 3686 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ. 8 వేల నుంచి 14 వేల వరకు వేతనం ఉండగా, మున్సిపాలిటీల్లో సిబ్బందికి రూ. 15,500 వేతనం అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతి కార్మికుడికీ మరో వెయ్యి రుపాయల వేతనం పెరగనున్నది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రూ. కార్మికులకు ప్రతినెలా 36.86 లక్షలను చెల్లించనున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో పల్లెలు మెరుస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉన్నది. పల్లెప్రగతి అమలుతోపాటు పారిశుద్ధ్య నిర్వహణలో మన గ్రామాలు జాతీయ స్థాయి అవార్డులు సాధించాయి. పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో పాలుపంచుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఏండ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేసిన సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొలిసారి రూ.3500 వేతనాన్ని పెంచారు. తాజాగా మేడేను పురస్కరించుకొని మరో వెయ్యి రూపాయలు పెంచారు.
అనుకోని తీపి కబురు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు అనుకోని తీపికబురును అందించారు. మేడే కానుకగా రూ. వెయ్యి వేతనాన్ని పెంచారు. జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కలిపి 3686 మంది కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణకు ఎంతో కృషి చేస్తున్నారు. స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దడంతో వీరి పాత్ర ప్రధానం. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు షిఫ్టుల వారీగా చెత్తసేకరణ చేపడుతున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. తమ శ్రమను ముఖ్యమంత్రి గుర్తించడంపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల సంబురాలు..
కార్మికులకు వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటిచండంపై హర్షాతిరేకాలు వ్యక్తంమవుతున్నాయి. మేడే కానుకగా రూ. వెయ్యి వేతనం పెంచడంతో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సంబురాలు చేసుకుంటున్నారు. కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని కొనియాడుతున్నారు. కృతజ్ఞతగా తామంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని అంటున్నారు.
సీఎం నిర్ణయం అభినందనీయం
పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి రూపాయల వేతనం పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో కార్మికుల సేవలు వెలకట్టలేనివి. ప్రజలు రోగాలబారిన పడకుండా ఎప్పటికప్పుడు వీధులను శుభ్రంగా ఉంచుతారు. వారి కృషిని సీఎం గుర్తించడం అభినందనీయం.
-నల్లపు అంజలి, సర్పంచ్, దోమకొండ
మా శ్రమకు ఫలితం దక్కింది..
మా శ్రమకు ఫలితం దక్కింది. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో మేము పడుతున్న కష్టాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. మేడే కానుకగా వెయ్యిరుపాయల వేతనాన్ని పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. మా జీతాలు పెంచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
-నర్సింహులు, పారిశుద్ధ్య కార్మికుడు, దోమకొండ
అండగా నిలబడింది కేసీఆరే..
గ్రామాల్లో పనిచేసే మా కష్టసుఖాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మా పనిని గుర్తించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో మేము పడుతున్న కష్టాన్ని చూసి అండగా నిలబడ్డారు. సీఎం కేసీఆర్ లేకుంటే మా గురించి ఆలోచించే వారే ఉండకపోయేది.
-మల్లేశ్, పారిశుద్ధ్య కార్మికుడు, పోచంపాడ్, మోర్తాడ్ మం.
సంతోషకరం..
మా వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. వేతనాలు పెంచాలని ఆలోచించింది, పెంచింది సీఎం కేసీఆర్ సారే. ఆయన కృషితోనే రెండోసారి వేతనం పెరిగింది. ఆయన మేలు మరువలేం.
-సంగెం భూమేశ్వర్, కిసాన్‌నగర్, బాల్కొండ మండలం
కేసీఆర్ సాబ్ మా గురించి ఆలోచిస్తడు..
ఊర్లను శుభ్రంగా ఉంచే పంచాదాఫీసు పనోళ్ల గురించి కేసీఆర్ సార్ తప్ప ఎవ్వరూ ఆలోచించ లేదు. ఇంతకుముందు మాకు మూడు వేలనర పెంచిండు. ఇప్పుడు మళ్లా వెయ్యి వెంచిండు.
-గంగనర్సు, జీపీ కార్మికురాలు, వేల్పూర్