ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 16 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా పోరాడుదామని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పిలుపునిచ్చారు. ఉద్యమంతో రాష్ర్టాన్నే సాధించుకున్నామని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని సూచించారు. కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాటాలతో ప్రత్యేక రాష్ర్టాన్నే సాధించామని గుర్తుచేశారు. రెండు పర్యాయాలుగా కేసీఆర్ సారథ్యంలో అధికారం చేపట్టి, రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దామని వివరించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వెనకడుగు వేయొద్దని, కాంగ్రెస్ పార్టీ హామీలను పూర్తిగా అమలుచేసేలా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.