ఢిల్లీ వేదికగా మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా నిలిపారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చి అధినేత కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత మొట్టమొదటి కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ వేడుకలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యాలయ ప్రారంభం అనంతరం ఉమ్మడి జిల్లా నేతలు అధినేతకు అభినందనలు తెలియజేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాలుగు రోజుల ముందుగానే అక్కడికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్టీసీ చైర్మన్ బా జిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బిగాల గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, షకీల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దఫేదార్ రాజు, పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీలు సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్‌తో పాటు ఇతర నాయకులు వేడుకలో పాల్గొన్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థానంలో కీలమైన ముందడుగు పడింది. భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్పు జరిగిన అనంతరం గులాబీ పార్టీ చకచకా వ్యూహాలకు పదును పెడుతున్నది. డిసెంబర్ 9న జాతీయ పార్టీ ఆవిర్భావం అనంతరం బుధవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్య నేతలంతా భారీగా తరలి వెళ్లా రు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులంతా చారిత్రక ఘట్టంలో పాల్గొన్నారు. దేశ్ కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ అడుగడుగునా నినాదాలు చేస్తూ సందడిగా గడిపా రు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం అధినేత కేసీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. నాయకులంతా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నూతనంగా ఆవిష్కరించిన గులాబీ కండువాలతో నేతలంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశ పటంతో కూడిన కొత్త కండువా నేతల మెడలో మెరిసింది. కొత్త జెండా, నూతన ఎజెండాలతో పాటు హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌లో లిఖించిన బీఆర్ఎస్ అక్షరమాలతో గులాబీ దళమంతా ఢిల్లీ వేదికగా తనదైన శైలిలో సత్తా చాటింది.
మరో ప్రస్థానం…
రెండు దశాబ్దాల అనంతరం గులాబీ పార్టీ మరోసారి చరిత్రను లిఖించింది. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేకంగా జాతీయ రాజకీయాల్లో నూతన పంథాను ఆరంభించేందుకు బీఆర్ఎస్గా అవతరించింది. ప్రధానమైన స్వరాష్ట్ర ఆకాంక్షే ధ్యేయంగా ఆవిర్భవించిన కారు పార్టీ తన లక్ష్యాన్ని ముద్దాడింది. 2014 అనంతరం బంగారు తెలంగాణ స్వప్నంగా పెట్టుకున్న గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ తోవలోనే పయనించి తెలంగాణను కొంగొత్త రీతిలో నిలిపారు. దేశంలో అనేక రాష్ర్టాల కన్నా మెరుగైన పరిపాలనను, అభివృద్ధిలో మేటిగా నిలిపి చుక్కానిగా రాష్ట్రం ఇప్పుడు నిలిచింది. ఈ దశలోనే సీఎం కేసీఆర్ తన ముందు మరో లక్ష్యా న్ని ఎంచుకున్నారు.
దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ను ఏకంగా బీఆర్ఎస్గా మార్పు చేసిన అనంతరం ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గట్టి సవాల్‌ను విసిరారు. ప్రజాస్వామ్యానికి చేటుగా దాపురించిన కమలం పార్టీని తరిమికొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ఇకపై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. అధినేత బాటలో గులాబీ సైన్యమంతా పయనించనున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన భారత్ రాష్ట్ర సమితి నేతలు భారీగా దేశ రాజధానికి తరలి వెళ్లారు. ఇరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఒక రోజు ముందే చేరుకున్నారు. తాత్కాలిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాలుగు రోజులు ముందే హస్తినకు చేరుకొని ఏర్పాట్లలో బిజీబిజీగా గడిపారు. శాశ్వత ప్రాతిపదికన వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార్యాలయంతో పాటుగా తాత్కాలిక కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఆర్టీసీ చైర్మన్ బా జిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, షకీల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దఫేదార్ రాజు, పోచారం సురేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీపాటిల్ ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొద్ది రోజుల ముందు నుంచే ఢిల్లీలోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాల్లో పాలుపంచుకున్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా…
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75సంవత్సరాలు దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అమృతోత్సవాల పేరిట దేశ వ్యాప్తంగా సంబురాలు జరిపింది. 2014 నుంచి రెండుసార్లు అధికారం చేపట్టిన బీ జేపీ పాలనలో ప్రజలంతా తీవ్రమైన ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. పేద ప్రజలంతా బతకలేక పోతున్నారు. మోదీ పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలు, అందుబాటులో లేని పెట్రోల్, డీజిల్ వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ రైతుల ఉసురు తీస్తోన్న బీజేపీ సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది.
మతం పేరిట జనం మధ్య చిచ్చు ను రాజేస్తూ పైశాచికత్వాన్ని పొందుతూ అమాయకులను బలి చేస్తోంది. రాజ్యాంగ విలువలను పాటించకపోవడంతో పాటు సమాఖ్య వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా మారనున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముంగిట కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ చరిత్ర లిఖించడం ఖాయమన్న సంకేతాలు ఇప్పటికే అంతటా వెలువడుతున్నాయి.