ధర్పల్లి, జూలై 1 : తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పనికి మాలిన సంస్కారహీనమైన మాటలు మానుకొని, రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి, విస్తృతంగా సభ్యత్వ నమోదును చేపట్టాలని ఇన్చార్జి బాధ్యులకు సూచించారు. ఈ సందర్భంగా విలేకరులతో జగన్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతు ఏనాడూ బాధపడింది లేదన్నారు. ఎకరం, రెండెకరాలు అంటూ వివక్ష లేకుండా ప్రతిఒక్క రైతుకు రైతుబంధు అందించారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు అందరికీ అందించడం చేతగాక ఎగబెట్టేందుకు సాకులు వెతుక్కుంటూ ఎకరం, రెండు ఎకరాలకు మాత్రమే డబ్బులు వేస్తూ రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
పాలన చేతగాక గత పాలకులను విమర్శించడం శోచనీయమన్నారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సినిమాలోని పశుపతి కాదని, నేపాల్లో గల పశుపతినాథ్ లాంటి దైవమని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించి లబ్ధి పొందాలనుకుంటే రైతులే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పీసు రాజ్పాల్రెడ్డి, నల్ల హన్మంత్రెడ్డి, సర్పంచ్ భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.