ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలోని ఊరచెరువు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గొంతు కోసి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. మంగళవారం ఉదయం జరిగిన ఘటన రాంపూర్ గ్రామంలో కలకలం రేపుతోంది. కాగా ఘటన స్థలానికి చేరుకున్న ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన పోలు వెంకటేశ్వర్లు (45)గా పోలీసులు గుర్తించారు.
హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటనతో రాంపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. చిల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తులే పాత కక్షలతో హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.