కామారెడ్డి గడ్డపై విరబూసిన సాహితీ కుసుమం దివికేగింది. ప్రముఖ కవి, ‘దాశరథి’ అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ (68) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎంతో మందిని సాహితీవేత్తలుగా తీర్చిదిద్దిన ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొన్నది. బుధవారం బోయిన్‌పల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-కామారెడ్డి/సుభాష్‌నగర్, సెప్టెంబర్ 2
కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జయలక్ష్మీదేవి, ఆనందరాజశర్మ దంపతులకు 1956లో జన్మించారు నటేశ్వరశర్మ. ఆయ న ప్రాథమిక విద్యాభ్యాసం అం తా రామారెడ్డిలోనే సాగింది. ఏడో తరగతి నుంచి ఎం.ఏ. వరకు తిరుపతిలో చదివారు. విద్యార్ధి దశ నుంచే సాహిత్యంలో ప్రావీణ్యం సాధించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడు ఉన్న తెలుగు పండితులలో చాలా మంది ఆయన శిష్యులే. అయాచితం చేసిన సాహిత్య సేవలకు గాను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డుతో సత్కరించింది. నాటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నటేశ్వర శర్మ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
గొప్పగొప్ప రచనలు..
విద్యార్థి దశ నుంచే నటేశ్వర శర్మ కవితారచనలో ఆరితేరారు.1975లో తన కవితా గురువు డా.సి.నారాయణరెడ్డికి అయితు కవితా సంకలనాలను రచించి అంకితం చేశారు. సినారె రచించిన రామప్ప సంగీత రూపకాన్ని సంస్కృతంలోకి అనువదించి, ఆయన ప్రశంసలు పొందారు. కామారెడ్డిలోని ఓరియంటల్ పాఠశాలలో ఆచార్యుడిగా, ప్రధానాచార్యులుగా, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ప్రాచ్యవిభాగానికి డీన్‌గా పని చేశారు. 1975 నుంచి 2014లో పదవీ విరమణ పొందే వరకు 50కి పైగా గ్రంథాలు, రచనలు, వందకు పైగా అష్టావధానాలు చేశారు.
అందులో వసంత కుమారి, శ్రీ గజాననస్తోత్రమ్, శ్రీ షోదశీ, భారతీ ప్రశస్తి, అముక్తమాల్యద పరిశీలనము, ఋతుగీత, శ్రీ శివమహిమ్మాస్తోత్రవ్యాఖ్య, సమయవిలాసిని, నవ్యగీతి, బాల రామాయణము, కవి తా శతకము, నవ్య నీతి శతకము, శ్రీ రాజేశ్వర శతకము, శ్రీ గణేశ శతకము, శ్రీ మా తృ కావర్ణమాలికా, శ్రీ రామగుణమణిమాల, ఆంధ్రతేజం, భారతీయ శతకం, ఆరురుచుల ఆమని, పంచశరీయమ్.. ఇలా ప్రఖ్యాత రచనలు ఆయన కలం నుంచి జాలువారినవే.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక మంది యువతీయువకులకు సాహిత్య ప్రక్రియల్లో చేదోడువాదోడు గా ఉంటూ వారు రాసిన పుస్తకాలకు ముందుమాట రాసి గురుస్థానాన్ని పొందారు. ఆయన సాహితీ సేవలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం.. 2023లో దాశరథి అవార్డుతో సత్కరించింది.
ఆర్నెళ్ల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న నటేశ్వర శర్మ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కవులు వీపీ చందన్రావు, కందాళై రాఘవాచార్య, చంద్రశేఖర్‌శర్మ, కాసర్ల నరేశ్‌రావు, గం ట్యాల ప్రసాద్, శారదాహన్మాండ్లు, డాక్టర్ బోచకర్ ఓంప్రకాశ్, కందకుర్తి ఆనంద్, గంగాప్రసాద్, డాక్టర్ గణపతి అశోకశర్మ, డా. తల్లావజ్జల మహేశ్‌బాబు తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయాచితం మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.