దశాబ్దాలుగా మట్టికొట్టుకుపోయిన రోడ్లు.. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థతో రోడ్లపైనే మురుగునీటి ప్రవాహం.. వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయాలంటేనే నరకప్రాయం.. ఇదంతా ఒకప్పటి మాట.. స్వరాష్ట్రంలో పల్లెలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొంగొత్త రూపును సంతరించుకున్నాయి. ఊరూరా అంతర్గత రోడ్లు అద్దంలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నది. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే అంతర్గత రహదారుల కోసం గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో రూ.102 కోట్లు కేటాయించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో నియోజకవర్గంలోని గ్రామాల స్వరూపమే మారిపోయింది. 60 ఏండ్లుగా సాధ్యం కాని పనులను ఎనిమిదేండ్లలోనే పూర్తి చేశారు. 2014 నుంచి 2022 వరకు రూ.82 కోట్ల వ్యయంతో భారీగా సీసీ రోడ్లను నిర్మించారు. ఇటీవలే మరో రూ.20 కోట్లు మంజూరు చేయించారు. దీంతో సీసీ రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.వంద కోట్ల మైలురాయిని చేరడం గమనార్హం.
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 11 : మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. రోడ్లు, సీసీ రోడ్లు, సాగు నీటి సౌకర్యం, తాగు నీటి సౌకర్యం తదితర ఎన్నో రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. స్వరాష్ట్రం సాకారమవ్వడం, గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట వేయడం ద్వారా కేసీఆర్ సర్కారు గ్రామాల రూపురేఖలు మార్చి వేస్తున్నది. కండ్ల ముందే ఈ అభివృద్ధి కనిపిస్తున్నది. బాల్కొండ నియోజక వర్గంలో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
గడిచిన ఎనిమిదేండ్ల కాలంలోనే బాల్కొండ నియోజకవర్గంలో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి వంద కోట్ల రూపాయల మైలు దాటింది. దీంతో నియోజకవర్గంలో గ్రామగ్రామాన వీధులు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. తన నియోజకవర్గంలో అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చేస్తున్న కృషి ఫలితమిది. 60 ఏండ్లలో అరకొరగా మాత్రమే సీసీ రోడ్ల సౌకర్యం కలిగితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే మంత్రి రూ.102 కోట్ల అంతర్గత సీసీ రోడ్ల ప్రగతిని బాల్కొండ నియోజకవర్గానికి అందించారు.
నియోజక వర్గంలో 2014 వరకు సీసీ రోడ్ల అభివృద్ధికి 2014 తర్వాత మంత్రి వేముల ప్రత్యేక కృషితో జరిగిన సీసీ రోడ్ల అభివృద్ధికి ఎంతో తేడా కనిపిస్తుంది. ఎనిమిదేండ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రధాన జనవాసాల్లో సైతం అంతర్గత సీసీ రోడ్లు కనిపించని పరిస్థితి ఉండేది. ఎన్నో జనావాసాలు, వీధులు కాలనీలు మట్టి కొట్టుకుపోయిన రోడ్లు, మురికి నీరు అడ్డంగా ప్రవహించే దారులతో దుర్గంధంగా, నరక ప్రాయంగా ఉండేవి. పరిస్థితిని సునిశితంగా గమనించిన మంత్రి వేముల.. ఆదిలోనే సీసీ రోడ్ల ఆవశ్యకతపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఎక్కడెక్కడ తక్షణ అవసరం ఉంది. ప్రాధాన్యతా క్రమంలో సీసీ రోడ్లు వేయాలనే ప్రణాళిక ప్రకారం వాటిని సాధిస్తూవచ్చారు. దీంతో 2014 తర్వాత 2022 వరకు బాల్కొండ, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, మెండోరా, ము ప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల జాతర కొనసాగింది. 2022 వరకే రూ.82 కోట్ల అంతర్గత సీసీ రోడ్లను సాధించి నిర్మాణం చేయించారు.
90 శాతం పనులు వేగంగా పూర్తి చేయించి గ్రామాల అంతర్గత రోడ్ల రూపురేఖలు మార్చి వేశారు. ఫలితంగా సీసీ రోడ్లకు నోచుకోని గిరిజన తండాలు సైతం అంతర్గత సీసీ రోడ్ల సౌకర్యాన్ని సంతరించుకున్నాయి. అన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా కాలనీలు, ఇండ్ల ముందర మురికి కాలువలను తలపించిన అంతర్గత దారులెన్నో సీసీ రోడ్లుగా మారి పోయాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల గణనీయమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయి.
ఈ క్రమంలో నియోజక వర్గానికి ఇటీవలే మంత్రి ప్రశాంత్ రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.20 కోట్లు మంజూరు సాధించారు. ఈ నిధుల మంజూరీతో బాల్కొండ నియోజకవర్గంలో కేవలం ఎనిమిదేండ్ల కాలంలోనే రూ.వంద కోట్ల మైలు రాయి దాటిన సీసీ రోడ్ల నియోజక వర్గంగా నిలిచింది.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడంతో మా కాలనీలో రోడ్డు సీసీ రోడ్డుగా మారింది. గ్రామాల్లో సీసీ రోడ్లు వాడ వాడలా కనిపిస్తున్నాయంటే అందులో సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల చేసిన కృషి ఎంతో ఉంది .
-ధర్మాయి రాజు, బాల్కొండ
మంత్రి వేముల సార్ పట్టిచుంకునుడుతోనే మా గుమ్మిర్యాల్ అసుంటి ఆఖరకు ఉన్న ఊర్లలోని గల్లీల సీసీ రోడ్లు అయినయ్. మునుపట్ల యాడికొక్క సీసీ రోడ్డు ఏ యాడాదికోకటో, రెండేండ్లకొకటో అచ్చేడ్ది. గిప్పుడు గీ గల్లీల సీసీ రోడ్డు అయిందో లేదో ఇంకో గల్లీల సీసీ రోడ్డు అస్తున్నది
-సోమ చిన్న గంగారాం, గుమ్మిర్యాల్, ఏర్గట్ల
మా కమ్మర్‌పల్లిలో ఇప్పుడు ఎటు జూసినా సీసీ రోడ్లయినయి. ఎన్నో ఏండ్ల సంది ఎదురు చూసినా మంజూరు కాని రోడ్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్‌కు చెప్పంగనే మంజూరయినయి. పనులు కూడా పటాఫట్ అయిపోయినయ్. మంత్రి సార్‌కు దండాలు.
– ధోనీ, కమ్మర్పల్లి