నిజామాబాద్, నవంబర్4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల మలి విడుత షెడ్యూల్ విడుదలైంది. బీఆర్ఎస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు నవంబర్ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో గులాబీ అధినేత పర్యటన ఖరారైంది. ఇందులో భాగంగా 15వ తేదీనాడు ఒకే రోజు మొ త్తం నాలుగు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభ ల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇందులో మూడు సభలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తొలుత బోధన్‌లో, ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్‌లో, ఇక్కడ్నుంచి ఎల్లారెడ్డి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఎల్లారెడ్డి సభను ముగించుకుని మెదక్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ హాజరై ప్రసంగిస్తారు.మరునాడు 16వ తేదీనాడు సైతం నాలుగు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటుండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంది. నిజామాబద్ రూరల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వస్తారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయంగా ముగిశాయి. నవంబర్ 9న కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ సభ జరుగనుంది. ప్రజా ఆశీర్వాద సభలను బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.