తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరుపుకొన్న వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు కేక్ కట్‌చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రాలతోపాటు పల్లెలు, పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమ సూర్యుడు, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ధీరుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -అనిల్ దంపతులతోపాటు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.