నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో దిగ్విజయంగా జరిగింది. ఈ సభను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు ప్రారంభ సూచకంగా ప్రకటించింది. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన సభకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సాగుతోన్న అరాచక పాలన, ప్రభుత్వ ఇష్టారాజ్యం, హామీల అమలులో లోపాలు, రాక్షస పరిపాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఈ విమర్శలకు బాగా స్పందించి నినాదాలతో కేసీఆర్‌కు మద్ధతు తెలిపారు. జగిత్యాల జైత్రయాత్ర విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. గులాబీ పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో మునిగి తేలుతున్నారు. జగిత్యాల నుంచి మొదలైన ఈ జైత్రయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసిందని గులాబీ శ్రేణులు సంబురం వ్యక్తం చేశారు.
తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ చేస్తోన్న ప్రజా పోరాటాలకు ప్రతిఫలంగా జగిత్యాల సభకు జనం పోటెత్తడం కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజలంతా కేసీఆర్ సభకు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రసంగాన్ని జనాలంతా శ్రద్ధగా విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను బీఆర్ఎస్ అధినేత ఎండగట్టడంతో క్షుణ్నంగా విని అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను అవగతం చేసుకుని అవగాహన తెచ్చుకున్నారు.
డైవర్షన్ పాలిటిక్స్‌తో పబ్బం గడుపుతోన్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. జగిత్యాలలో బీఆర్ఎస్ జైత్రయాత్ర సభను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి చేరికను ఓర్చుకోలేక సభకు జనాలు రాకుండా ఉండేందుకు అనేక కుట్రలకు దిగారు. జైత్రయాత్ర సభతో ఉత్తర తెలంగాణలో మరోసారి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ సమాయత్తం కావడంపై కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోయింది. కేసీఆర్ ప్రసంగానికి జనాల నుంచి స్పందన వస్తుందని ముందే గ్రహించి ప్రజలు రాకుండా అడ్డగించారు. టీవీల్లో ప్రసారాలు జరగనివ్వకుండా చిల్లర చేష్టాలకు పాల్పడ్డట్లుగా జనాలంతా మండిపడుతున్నారు.
కేసీఆర్ సభతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందని ఊహించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి మేడిగడ్డ టూర్‌కు ప్లాన్ చేసుకున్నాడు. వరి నాట్ల సమయంలో రైతుల చేతికి ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని రెండో విడత ప్రారంభం పేరుతో ప్రభుత్వ ధనంతో పోటాపోటీగా సభను పెట్టి కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నాడని ప్రజలంతా మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డగించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై సర్వత్రా జనం మండిపడుతున్నారు. కేసీఆర్ హాజరైన జగిత్యాల జైత్రయాత్ర సభ ద్వారా ఉమ్మడి కరీంనగర్‌తో పాటుగా అవిభాజ్య నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు ప్రభావితం అయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో జగిత్యాల సభ కొత్త ఉత్సాహాన్ని అందించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు… 420 హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తనదైన శైలిలో చీల్చిచెండాడారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేయడంతో పాటుగా కొత్త రాష్ర్టాన్ని ఏ విధంగా బాగు చేసుకున్న తీరును కేసీఆర్ వివరించారు. సామాన్య జనాలకు అర్థమయ్యే రీతిలో విడమరిచి చెప్పడంతో శ్రద్ధగా కేసీఆర్ మాటలను సభకు హాజరైన వారంతా విన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతోన్న మోసాలను ఎండగట్టారు. సమయానికి అందని పెట్టుబడి సాయం, సాగు నీటి కొరత, ఉచిత విద్యుత్ సరఫరాలో లోపాలు, యూరియా కొరత, విత్తనాల సరఫరాలో జాప్యం, పంటల కొనుగోళ్లలో శ్రద్ధ చూపకపోవడం వంటి అనేక అంశాలను కేసీఆర్ ఎత్తి చూపారు. కాంగ్రెస్ అసమర్ధతను తేటతెల్లం చేశారు. నిత్యం చిల్లర మాటలు తప్పా నిర్మాణాత్మకమైన మాటనే పాలకుల్లో లేదని మండిపడ్డారు. హైడ్రా తరహాలో నిజామాబాద్‌లో నిడ్రా తెస్తానని గతంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన వ్యాఖ్యలను కేసీఆర్ గుర్తు చేశారు. పేదల పొట్ట కొట్టే చర్యలను వచ్చే అధికారంలో తీసి బయట పడేస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.