విద్యానగర్, జూన్ 21: వసతి గృహాల్లోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం వసతి గృహాల సమస్యలపై సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బీసీ, మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, కస్తూర్బా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని సూచించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. సంక్షేమ అధికారులు అందుబాటులో ఉండి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, మైనార్టీ కస్తూర్బా, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.
వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలి
వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం కేంద్రీయ భూగర్భ జల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఇంటి ఎదుట ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీరు వృథా కాకుండా చూడాలన్నారు. రైతులు తమ పొలాల్లో పాంపాండ్స్ నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు దోహదపడాలన్నారు. తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలు రైతులు సాగు చేసుకోవాలని సూచించారు.
రసాయనిక ఎరువులు అధికంగా వాడడతో నీరు కలుషితమవుతుందని అన్నారు. రైతులు పందిరి విధానంలో కూరగాయల సాగు చేపట్టి లాభాలు పొందాలని సూచించారు. బిందు సేద్యం ద్వారా పంటలను సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని భూగర్భ జలాలపైన నివేదికను సీజీడబ్ల్యూబీ సైంటిస్ట్ విఠల్, మాధవ్, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. నివేదిక పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సీపీవో రాజారాం, జిల్లా భూగర్భ జలాల అధికారి సతీశ్‌యాదవ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బడిబాట ర్యాలీ సంచార వాహనం ప్రారంభం
కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆవరణలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీ బడిబాట సంచార వాహనం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికవసతుల పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రఘవరెడ్డి,ప్రతినిధులు లక్ష్మీపతి,ఆంజనేయులు,రాజశేఖర్,భాస్కరాచారి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించాం జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4,778 కోట్లుకాగా ఇప్పటికి వరకు రూ.3,442 కోట్లు రుణ వితరణ చేసి 72 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలైన గృహ, వ్యాపార, మహిళా సంఘాలకు ఆశించినంత మేరకు రుణ వితరణ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎల్డీఎం చిందం రమేశ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం రహమాన్, నాబార్డ్ డీజీఎం నగేశ్, డీసీసీబీ డీజీఎం బ్రహ్మానందరెడ్డి, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, ఇతర బ్యాంకుల అధికారులు, వ్యవసాయ పశుసంవర్ధక శాఖ పారిశ్రామిక శాఖ, మెప్మా, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.