నిజామాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ శాంతియుత జంగ్ సైరన్ మోగించింది. యాసంగిలో తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో నానాయాగి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్ పోరుబాటకు సిద్ధమయ్యారు. స్వరాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ రైతుల బాగుకోసం కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గులాబీదళం రెడీ అయ్యింది. యాసంగి వడ్లను కేంద్రమే కొనుగోలు చేసేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గులాబీశ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమకాలంలో ప్రాణాలకు తెగించి కేసీఆర్ కొట్లాటాడు. నేడు స్వరాష్ట్రంలో రైతు బాగు కోసం అలుపెరగని పోరాటానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు, ఇప్పుడు పరిస్థితులు వేరైనప్పటికీ రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందంటే సహించలేక కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బరి గీసి పోరాటం చేసేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెడీ అయ్యారు. చీటికి మాటికి బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం, ఫక్తు రాజకీయాలనే నమ్ముకొని పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ తీరును ప్రజల్లో తేటతెల్లం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మోదీ విధానాలను ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కొద్ది నెలలుగా ఢిల్లీ పెద్దలకు నిరసన సెగల రుచి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరోమారు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేస్తున్న యాగిపై అగ్గిరాజేసి బుద్ధి చెప్పాలని నిశ్చయించారు.
వారంపాటు నిరసనోద్యమం..
తెలంగాణలో పండించిన వడ్ల కొనుగోలు విషయంలో రెండున్నరేళ్లుగా కేంద్రం చేస్తున్న గందరగోళానికి శాశ్వతంగా తెరదించి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు పోరుబాటనే సరైన విధానమనే అభిప్రాయంతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిరసనోద్యమానికి శ్రీకారం చుట్టారు. వివిధ స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల కన్నా తీవ్రంగా నిరసన దీక్షలు చేయడంతోపాటు ఏప్రిల్ 11న ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆందోళన చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారులపై రాస్తారోకోలు, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఢిల్లీకి కర్షకుల నిరసన సెగ..
టీఆర్ఎస్ చేస్తున్న రైతు అనుకూల ఉద్యమాల నేపథ్యంలో ఢిల్లీకి తాకిన సెగలతో అల్లాడుతున్న బీజేపీ పెద్దలు ఏమీ చేయలేక ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అందులో తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడం విచారకరం. ఒకప్పుడు ఏదేని పంట సీజన్లో ఉమ్మడి జిల్లాలో 4లక్షల నుంచి 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తేనే గొప్ప. ఇప్పుడదీ 11లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. వచ్చిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం రిస్క్ చేసి కొనుగోలు చేస్తూ వస్తున్నది. మర ఆడించి ఎఫ్‌సీఐకి బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీలు పెడుతూ బియ్యం తీసుకోవడంలో కిరికిరి చేస్తున్నది. బియ్యం బస్తాలను తరలించదు. ఇదేమంటే ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లుగా ఎదురుదాడి. వడ్ల సేకరణపై కేంద్రం చేస్తున్న యాగితో సీఎం కేసీఆర్ అప్రమత్తమై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన ఉద్దేశంగా కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. కేంద్రంతో అమీతుమీకి రెడీ అయ్యింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
మోదీకి వ్యతిరేకంగా నల్లజెండాలతో..
ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనం చెలాయిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఓ రకంగా, బీజేపేతర రాష్ర్టాల్లో మరో రకంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నది. ఆహార చట్టానికి తూట్లు పొడిచేలా మోదీ సర్కారు నడుస్తుండడంతో తెలంగాణలో పండిస్తున్న వడ్ల విషయంలో అయోమయం నెలకొన్నది. యాసంగి సీజన్ ప్రారంభంలోనే తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ చైతన్య పరిచారు. నష్టపోకూడదనే ఉద్దేశంతో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
వడ్లను కేంద్రం కొనకపోవడంతో ఎదురయ్యే పరిస్థితులను ముందే ఊహించి అవగాహన కార్యక్రమాలు చేపడితే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లాంటోళ్లు మాత్రం వరి వేయాలంటూ రైతులను రెచ్చగొట్టారు. సాగుదారుల్లో చెడు ఆలోచనలు జొప్పించి వారిని వక్రబాటలో నడిచేలా బీజేపీ ప్రోత్సహించింది. చాలామంది రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి ఇతర పంటలు సాగు చేయగా కొంత మంది బీజేపీ నాయకుల మాటలు విని వరిని పండించారు. వీరి పంటను సేకరించాలంటే ఇప్పుడు కేంద్రం విధిస్తున్న కొర్రీలతో ఇబ్బంది నెలకొన్నది. అందుకే బీజేపీ నేతలు గల్లీలో ఓ రకంగా ఢిల్లీలో మరోరకంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ నల్ల జెండాలు ఎగురవేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8న గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి రైతూ తమ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేయనున్నారు.