నిజామాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచితేనే దారికొస్తుందని.. అందుకే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీ యాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్ చాప్టర్ క్లోజ్ అయ్యిందని.. పసుపు బోర్డు అంశాన్ని పక్కకు నెట్టేందుకు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. యాసంగి సీజన్లో వరి వేయాలని రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వడ్ల కొనుగోలు విషయం వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, వారి కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానికి రాష్ట్రమే వెయ్యి కోట్లు ఇవ్వాలనడం ఏంటని ఎంపీ అర్వింద్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అవగాహన రాహిత్యంతో, ఇంగిత జ్ఞానం లేకుం డా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ అర్వింద్ చాప్టర్ క్లోజ్ అయ్యిందన్నారు. పసుపు బోర్డుపై బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్‌ను రైతులు అడుగడుగునా నిలదీస్తున్నారన్నారు. వడ్ల విషయంలో దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే సమస్య ఎందుకు వస్తుందని అర్వింద్ ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అసలు సమస్య కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని మంత్రి చెప్పారు. ఎంపీ అర్వింద్ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఓట్లతో గెలిచినోడా? లేదా గుజరాతీ ఓట్లతో గెలిచినోడా అన్న అనుమానం వస్తుందని మంత్రి అన్నారు. కేంద్రమే తెలంగాణ వడ్లు కొనాలని తీర్మానాలు చేసిన బీజేపీ ఎంపీపీ, జడ్పీటీసీలకు మంత్రి హ్యాట్సాఫ్ చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉన్న తెలివి బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు లేదని దుయ్యబట్టారు. గడిచిన రెండేండ్ల దాకా ఇదే కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ తీసుకున్నారని, ఇప్పుడు తీసుకోమని చెబుతున్నారన్నారు. ఆ నూకలు ఏం చేయాలని ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను అడిగితే అవహేళనగా మాట్లాడారని గుర్తుచేశారు.
రెచ్చగొట్టినోళ్లు ఎక్కడ?
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌తో సంబంధం లేకుండా వడ్లను కేంద్రంతో కొనిపిస్తానని ప్రగల్భాలు పలికిన వారెక్కడున్నారంటూ ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితం వివిధ సందర్భాల్లో బండి, కిషన్‌రెడ్డి మాట్లాడిన వీడియోలనూ మంత్రి వేముల ప్రదర్శించారు. ఇప్పుడేమంటావ్ అంటూ నిలదీశారు. వడ్ల మీద బీజేపీకి కమీషన్ కావాలట.. అందుకే వెయ్యి కోట్లు రాష్ట్రం నుంచి అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచితేనే దారికొస్తదని, అందుకే బీజేపీ వాళ్లను గ్రామాల్లో నిలదీయాలన్నారు.
అర్వింద్‌ది అవినీతి చరిత్ర..
చదువు ఫేక్, బాండ్ పేపర్‌తో ఫ్రాడ్, మాడ్లాడేది ఫాల్స్ రూపంలో ఎఫ్త్రీగా మారిన అర్విం ద్ బట్టేబాజ్, బక్వాస్, బడేఝూటా బీత్రీ నుంచి లంగా, లఫంగా, లత్కోర్గా ఎల్త్రీగా రూపాంతరం చెందాడంటూ టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌పై, కేసీఆర్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మొరిగితే బట్టలు ఊడదీసి ఉరికిస్తామంటూ హెచ్చరించారు. కాళేశ్వరంలో లక్షన్నర కోట్లు, మిషన్ కాకతీయలో 25వేల కోట్లు అవినీతి జరిగిందని అడ్డగోలుగా అర్వింద్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే 85వేల కోట్లతోనని, మిషన్ కాకతీయకు పెట్టిన ఖర్చు 12వేల కోట్లని వివరించారు. నిజామాబాద్ ఎంపీని తక్షణం పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ పుట్టుకే అవినీతితో ముడిపడి ఉందని జీవన్‌రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి డి.శ్రీనివాస్ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లకు బీఫార్మ్లను అమ్ముకున్న చరిత్ర అర్వింద్‌కు ఉన్నదన్నారు. ఈ సందర్భంగా డీఎస్ అనుచరు డు, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ గతంలో చేసిన ఆరోపణల వీడియోను మీడియాకు చూపించారు. అందులో అర్వింద్ బండారాన్ని బట్టబయలు చేసిన వివరాలను కండ్లకు కట్టినట్లు చూపించారు.
గోయల్ వైపా? తెలంగాణ రైతుల వైపా?
రాష్ట్ర బీజేపీ నేతలంతా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పీయూష్ గోయల్ వైపా… తెలంగాణ రైతుల వైపా…? తేల్చుకోవాలన్నారు. పంజాబ్‌లో జీరో ఎంపీలుండడంతోనే బీజేపీ అక్కడ వంద శాతం వడ్లు కొంటున్నదని, తెలంగాణలో కూడా బీజేపీని జీరో చేస్తే వంద శాతం వడ్లు కొంటారని జోస్యం చెప్పారు. బీజేపీ నాయకులకు కోపం, కసి ఉంటే టీఆర్ఎస్పై, మాపై మాట్లాడాలం టూ సవాల్ విసిరారు. రైతులను అవమానపర్చేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. రైతులపై కాల్పులు జరిపిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఖతమైనయని, పంజాబ్‌లో రైతులతో పెట్టుకుంటే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గుండు సున్నా మిగిలిందని చెప్పారు. జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.