భిక్కనూర్, ఏప్రిల్ 3 : ‘నేను బ్యాంక్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌ను మాట్లాడుతున్నా. మీరు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని చాలా రోజులవుతున్నది. వడ్డీ పెరిగిపోతున్నది. డబ్బులు పంపాలి’ అని అమాయకులను ట్రాప్ చేసి డబ్బులను కాజేస్తున్న సైబర్ నేరస్తుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భిక్కనూరు మండలకేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ తిరుపతయ్య ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన అంకం శ్యామయ్యకు గత నెల 26వ తేదీన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, లోన్ డబ్బులు చెల్లించాలని సూచించాడు.
దీనిని నమ్మిన శ్యామయ్య రూ.12,400 కుమార్ ఫోన్‌కు ఆన్లైన్ ద్వారా పంపాడు. తర్వాత ఫోన్ చేయగా కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న శ్యామయ్య.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ సోమనాథం, భిక్కనూరు సీఐ తిరుపతయ్య, రాజంపేట ఎస్సై రాజు కేసు విచారణను వేగవంతం చేశారు. సైబర్‌క్రైం కేసును అధునాతన సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని గుర్తించి సరైన ఆధారాలను సేకరించారు. మందమర్రికి వెళ్లి కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు, రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో మందమర్రిలో సైతం కుమార్ ఒకరిని మోసం చేసినట్లు వివరించారు.