బాన్సువాడ రూరల్, మార్చి11 : పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మగవారికి ధీటుగా వివిధ రంగాలలో పోటీ పడాలని సూచించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో మగవారితో ధీటుగా పోటీ పడాలని సూచించారు. ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా విద్యను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. కుటుంబంలో ఆడబిడ్డ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. నర్సింగ్ విద్యకు మంచి డిమాండ్ ఉందని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కళాశాలకు వచ్చిన సబ్ కలెక్టర్కు విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.