బీబీపేట్, మార్చి 21 : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ రిసెప్షన్ సెంటర్ నందు ప్రతి ఒక్క ఫిర్యాదుని నమోదు చేసుకోవాలన్నారు. బాధితులకు సత్వర పరిష్కారం అందించే దిశగా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలన్నారు. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ వాటిని అరికట్టాలని తెలిపారు. దొంగతనాలు జరుగకుండా రాత్రి పూట గస్తి బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100కి కాల్ వస్తే వెంటనే స్పందించాలన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్హెచ్ఓలకు సూచించారు. అలాగే సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, దోమకొండ ఎస్.హెచ్.ఓ స్రవంతి, బీబీపేట ఎస్.హెచ్.ఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
SP Rajesh Chandra : ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర