బాన్సువాడ, జూన్ 28 : విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణా అవసరమని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎక్కడ చదివినా నాణ్యమైన విద్య అవసరమని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన ఉన్నత విద్యనభ్యసించినవారు విలువలతో కూడిన పౌరులుగా తయారవుతారని అన్నారు. సమాజానికి సేవ చేస్తారన్నారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.30 లక్షలతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. సమాజంలో కులం, మతం పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కల్గించి, సమాజానికి చెడు చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. సమాజంలో ఉత్తమ ప్రమాణాలు పెంచేవారు ఎప్పుడు అవసరమని పేర్కొన్నారు. విద్య విలువ తెలుసుకాబట్టే బాన్సువాడ నియోజక వర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను 1994 సంవత్సరంలో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు నియోజక వర్గంలో కేవలం ఒకే జూనియర్ కళాశాల ఉండేదని చెప్పారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కొత్త పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మౌలిక వసతులకు అధిక నిధులను కేటాయించినట్లు వివరించారు. గురుకులాలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, నర్సింగ్ కళాశాలలు మొత్తం 30 ఉన్నాయని, ఇందులో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు.
బాన్సువాడ అభివృద్ధికి రూ.650 కోట్లు
గడిచిన నాలుగున్నరేండ్లలో బాన్సువాడ అభివృద్ధి, మౌలిక వసతుల కోసం సుమారు రూ.650 కోట్లు ఖర్చుచేసినట్లు స్పీకర్ తెలిపారు.పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కల్కి చెరువును అభివృద్ధి చేశామన్నారు. కల్కి చెరువు కింద రూ. నాలుగు కోట్లతో పార్కు నిర్మిస్తున్నట్లు చెప్పారు. విత్తనం మంచిదైతే పంట బాగుంటుందని , కల్తీ విత్తనాలు నాటితే పంట దెబ్బతింటుందని అన్నారు. అదేవిధంగా సమాజానికి మంచి చేసేవారెవరు, చెడగొట్టే వారెవరు అనేది ప్రజల గమనించాలని కోరారు. ఒక్క విద్యావంతుడు సమాజంలోని లక్ష మందితో సమానమని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదని అన్నారు. తన పేరుపై పాఠశాలలో తరగతి గదుల బ్లాక్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, అవసరంలేదని పాఠశాల కమిటీ సభ్యులకు చెప్పానని, తనపై ప్రేమ మీ గుండెల్లో ఉంటే చాలని అన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలల విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని పాఠశాల అధ్యాపకబృందం, కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, పాఠశాల కమిటీ అధ్యక్షుడు నాగుల గామ వెంకన్న, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, బెజుగం సత్యనారాయణ, పిట్ల శ్రీధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, అమేర్ , వాహెబ్, లింగం, శ్రీనివాస్, నర్సుగొండ, వెంకటేశ్, హకీం, కిరణ్కుమార్, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠల్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.