
డిచ్పల్లి, అక్టోబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తూ గత ఏప్రిల్లో నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చాలా విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ జీవోలను జారీ చేయగా, ప్రస్తుతం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ ఇస్తామని ప్రకటించి తీపి కబురు చెప్పింది. ఈ మేరకు జీవోలను కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని రకాల ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు.
టీయూ పరిధిలో 276 మంది..
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన క్యాంపస్లో 230, సౌత్ క్యాంపస్ భిక్కనూర్లో 36, సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్లో 10 మందితో కలిపి మొత్తం 276 మంది ఉన్నారు. వీరిలో అటెండర్లు, సెక్యూరిటీ గార్డుల నుంచి మొదలుకొని జూనియర్ అసిస్టెంట్లు, ప్రోగ్రామర్ల వరకు కేటగిరీల వారీగా పని చేస్తున్నారు. గత 15 ఏండ్లుగా యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాల్లో వ్యత్యాసం ఉండేది. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించే సమయంలో అన్ని రకాల ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వారికి సమాన వేతనం అని, వారందరికీ పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వం జీవో నంబర్ 61, 63 విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వివిధ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
ఏటా రూ.కోటి 56 లక్షల అదనపు భారం
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వర్సిటీ అధికారులు 30 శాతం పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.కోటి 56 లక్షల అదనపు భారం పడనుంది. జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని స్వీపర్ వరకు ఉద్యోగులు, సిబ్బంది అందరికీ 30 శాతం పీఆర్సీ అమలు కానున్నది. సెప్టెంబర్ నెల నుంచే పెంచిన జీతాలు సిబ్బంది అందుకోనున్నారు.
రెగ్యులరైజ్ చేయాలి
అవుట్సోర్సింగ్ సిబ్బంది శ్రమను గుర్తించి 30 శాతం పీఆర్సీని అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్నో ఏండ్లుగా పీఆర్సీ కోసం ఎదురు చూశాం. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని గుర్తించడం హర్షణీయం.
అవుట్సోర్సింగ్ యూనియన్ పీఆర్సీ వర్తింపుతో గుర్తింపు
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పని చేస్తున్న కాంట్రా క్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం 276 మందికి 30 శాతం పీఆర్సీని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిలో ఎంతో ధైర్యం నింపినట్లు అవుతుంది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సిబ్బందికి పీఆర్సీ ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది.
-బీకోజి నాయక్, ప్రధాన కార్యదర్శి అవుట్సోర్సింగ్ యూనియన్