నిజామాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుంటారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం దాటి విదేశాలకు వెళ్లినప్పటికీ మన వాళ్లకు కొండంత అండగా నిలుస్తున్నారు. అది గల్ఫ్ బాధితులైనా… ఇతర ప్రాంతాల్లో అనుకోని ఘటనతో ఇబ్బందులు పడిన వారైనా… భేషజాలకు పోకుండా బాధ్యతగా ఆపదలో అండగా నిలిచే గుణం సీఎం సొంతం. తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా… సరే వారందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందన్న సంకేతాలను అందిస్తున్నారు. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా పరిపాలనను సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా అందరికన్నా ముందుగానే ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తూ ఎటూ తోచక అగమ్యగోచరంగా మారిన వారందరికీ దారి చూపారు. విదేశీ వ్యవహారాలను చూసే కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా ఇలాంటి అంశాలను చూడాల్సిన అనివార్యత ఉంటుంది. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఐదు రాష్ర్టాల ఎన్నికలు, వాటి ఫలితాల అనంతరం బీజేపీ వ్యవస్థాగత కార్యకలాపాల్లోనే మునిగి తేలుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చేసిన ప్రకటనతో కేంద్రం కండ్లు తెరిపించడమే కాకుండా అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలబడింది.
ఆశాదీపమైన రాష్ట్ర సర్కారు…
ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఉక్రెయిన్‌లో సర్వం నాశనమైంది. వైద్య విద్యను అందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలన్నీ మూతబడ్డాయి. ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు అడ్డుకట్ట పడింది. ప్రాణాలు దక్కించుకుని స్వదేశానికి వచ్చిన భారతీయులకు ఇప్పుడు ఓ రకమైన సందిగ్ధత ఏర్పడింది. కష్టపడి వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో యుద్ధం మూలంగా ఎదురైన విపత్కర పరిస్థితిని ఎదుర్కొని వైద్య వృత్తిలో నిలబడడం ఎలా? అనే సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఈ కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఆశాదీపమైంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో వారందరిలోనూ ఆశలు చిగురించాయి. ఆగిపోతుందనుకున్న చదువులకు కొనసాగింపు లభిస్తుందనే భరోసా వారందరిలోనూ కలుగుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 40మంది..
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఉన్నారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 40 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీరంతా వైద్యవిద్యను అభ్యసించేందుకే అక్కడికి వెళ్లారు. స్వదేశంలో వైద్యవిద్య కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరిదశలో ఉక్రెయిన్‌లో చదివేందుకు విమానం ఎక్కారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తున్నది. రష్యాతో యుద్ధం కారణంగా చదువుకు దూరమైన వారందరికీ అండగా ఉంటామని కేసీఆర్ చేసిన ప్రకటనతో వారిలో భరోసా కలుగుతున్నది. తిరిగి వచ్చిన విద్యార్థుల బాధ్యతను తాము తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించడంతో సంబంధిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వారందరి చదువుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వారు ఇక్కడే మెడిసిన్ చదివేలా చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. తెలంగాణ సర్కారు మాదిరిగానే మిగిలిన రాష్ర్టాలూ స్పందించాలన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నది. ముఖ్యంగా కేంద్ర సర్కారు బాధ్యతగా వ్యవహరించి ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల విషయంలో స్పందించాలని కోరుతున్నారు.
విస్మరించిన కేంద్ర సర్కారు..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల విషయంలో మోదీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యంపై ఇప్పటికే మండిపడ్డారు. మిగతా దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ పౌరులను ముందుగానే షిఫ్ట్ చేస్తే మోదీ సర్కారు మాత్రం ఆలస్యంగా స్పందించిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీపై ఇంటా బయటా విమర్శలు పెరగడంతో ఒక్కసారిగా విమానాలు పంపించి సాయం చేయాలనే ఆలోచనకు కేంద్రం పూనుకున్నది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విమానాలు పంపించి మన వారిని స్వదేశానికి రప్పించారు. ఇందులోనూ విమాన టికెట్లను ఆయా రాష్ర్టాలు భరించాయి. తెలంగాణ ప్రభుత్వం మన ప్రాంత బిడ్డల కోసం నిధులు వెచ్చించింది. ఇదిలా ఉండగా ఇప్పుడే ఉక్రెయిన్‌లో సంక్షోభం సమసి పోలేదు. యుద్ధం ముగిసినప్పటికీ సామాన్య పరిస్థితులు నెలకొనాలంటే చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో వైద్య విద్య కొనసాగింపు ఎలా? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం కనీసం ఆలోచన చేయకపోవడం విడ్డూరం. ప్రధాని మోదీ కండ్లు తెరిపించేందుకు ఈ సమస్యపై త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖను సంధించబోతున్నది.
మన దేశానికి చెందిన 20వేల మంది వైద్య విద్యార్థులు యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. మన రాష్ట్రం నుంచి 740 మంది ఉన్నారు. దీంట్లో 700 మంది పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. ఇక్కడ అవకాశం లేకనే అక్కడికి పోయిండ్రు. కిందా మీదా పడి 700 మందికి టికెట్లు భరించి వెనక్కి తెచ్చినాము. తేనైతే తెచ్చినాము. వాళ్ల భవిష్యత్తు ఏంది? వాళ్ల చదువు డిస్కంటిన్యూ కావాల్నా? ఆగిపోవాల్నా? తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులున్నాయా? పరిస్థితులు ఎప్పుడు బాగవుతాయో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తున్నా… వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా భరిస్తాం. భవిష్యత్తు దెబ్బతినకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాం.
– అసెంబ్లీలో మార్చి 15న సీఎం కేసీఆర్ ప్రకటన
హర్షించదగ్గ విషయం
ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన వైద్య విద్యార్థులను ఇక్కడే ఉచితంగా చదివిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయం. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ విద్యార్థులంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్నది. విద్యాభ్యాసం పూర్తయ్యాక రాష్ట్రం కోసం సేవలందిస్తాం. మరో సంవత్సరం చదవాల్సి ఉండగా మధ్యలోనే రావడంతో ఇంక ఎలా అని ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం మా కుటుంబాల్లో సంతోషాలను నింపింది. చదువు గురించి ఇక దిగులుపోయింది.
సంతోషంగా ఉంది
ఉక్రెయిన్లోయుద్ధం కారణంగా అక్కడి యూనివర్సిటీలు మూతపడడంతో చదువు మధ్యలో ఆగిపోయింది. మా తల్లిదండ్రులు అప్పులు చేసి మెడిసిన్ చదివించడానికి ఉక్రెయిన్‌కు పంపించారు. చదువు మధ్యలో ఆగిపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చాలా సంతోషమనిపించింది. ఉక్రెయిన్ నుంచి తీసుకురావడంతోపాటు చదువులను పూర్తి చేయిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాము.
– పాలెపు రుచిత, వైద్య విద్యార్థిని, ముచ్కూర్(భీమ్‌గల్)
రుణపడి ఉంటాం..
మా కూతురును ఉన్నతస్థాయిలో ఉంచేందుకు అప్పులు చేసి ఉక్రెయిన్‌లో చదివిస్తున్నాం. అనుకోకుండా యుద్ధం రావడంతో చదువులు ఆగిపోయి తిరిగి ఇంటికి వచ్చింది. సీఎం కేసీఆర్ వారిని ఇంటికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వ ఖర్చులతో వైద్యవిద్యను పూర్తి చేయిస్తామనడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
– పాలెపు ప్రమీల- రాజేశ్వర్, ముచ్కూర్ (మెడిసిన్ విద్యార్థిని తల్లిదండ్రులు)