కామారెడ్డి, మే 6 : కళాభారతి ఆడిటోరియం సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో రూ. 6 కోట్లతో నిర్మించిన కళాభారతి ఆడిటోరియాన్ని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి విప్ గంప గోవర్ధన్ ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. కామారెడ్డి అభివృద్ధి సహకరిస్తానన్నారు. ఇంతమంచి ఆడిటోరియాన్ని నిర్మించేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి ప్రాంత కళాకారులు కళాభారతి ఆడిటోరియాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్ లాంటి నాయకుడు దొరకడం అదృష్టమన్నారు. కామారెడ్డిలో ఆర్అండ్బీ అతిథి గృహంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలను దగ్గరుండి కట్టించారన్నారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను చూసి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలనీ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. అధునాతన వసతులతో నిర్మించిన కళాభారతి ఆడిటోరియంతో జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు పెరుగుతాయని అన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు కళాభారతిని నిర్మించామని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మామిండ్ల అంజయ్య, కుంబాల రవి, ముప్పారపు ఆనంద్, పంపరి శ్రీనివాస్, నారాగౌడ్, నిట్టు వెంకట్రావు, హఫీజ్బేగ్, మాసుల లక్ష్మీనారాయణ, గండ్ర మధుసూదన్‌రావు, నర్సింహారెడ్డి, గ్యారసాయిలు, గెరిగంటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.