బోధన్, ఏప్రిల్ 7: బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో ‘లయన్స్ క్వెస్ట్ గ్రాడ్యుయేషన్’ను గురువారం ఘనంగా నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో ఆరు నెలలపాటు నిర్వహించిన ‘లయన్స్ క్వెస్ట్ స్కిల్స్ ఫర్ అడొల్సెన్స్’ కోర్సును పూర్తిచేసిన 12 నుంచి 14 ఏండ్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్, మెమెంటోలను అందజేసేందుకు విశ్వవిద్యాలయాల్లో జరిగే స్నాతకోత్సవాల తరహాలో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
కోర్సును పూర్తిచేసిన 300 మంది విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎల్సీఐఎఫ్) ఏరియా లీడర్ లయన్ జి.బాబూరావుతోపాటు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టి.రామకృష్ణారెడ్డి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు శ్రీనివాస్, పోలవరపు లక్ష్మి, డిస్టిక్ట్ మాజీ గవర్నర్ పి.బసవేశ్వరరావు, ఇందూర్ హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ సర్టిఫికెట్లు, మెడల్స్, మెమెంటోలను అందజేశారు. శిక్షణలో భాగంగా నేర్చుకున్న అంశాలకు సంబంధించిన చార్టర్లు, ప్రదర్శనలను రూపొందించి ప్రదర్శించేందుకు తయారుచేసిన ‘డిపిక్షన్ హబ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల సృజనాత్మకతను అతిథులు అభినందించారు.
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏరియా లీడర్ డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ.. లయన్స్ క్వెస్ట్ స్కిల్స్ కోర్సుతో విద్యార్థులు పరిపూర్ణ వ్యక్తిత్వం గల పౌరులుగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ రుమాండ్ల నారాయణ, ట్రైనర్ లక్ష్మీమూర్తి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మీమూర్తి, పద్మావతి, ఐఆర్ చక్రవర్తి, వై.శ్రీనివాస్, థామసయ్య, సూర్యనారాయణ, రమారెడ్డి పాల్గొన్నారు.