తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన మొదలైంది. ఐదు నెలలుగా చేపట్టిన అడ్డదారి నియామకాలు, అడ్డగోలు ఉద్యోగోన్నతులను వర్సిటీ పాలకమండలి రద్దు చేసింది. 276మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మించి ఒక్కరిని అదనంగా నియమించినా బాధ్యులైన వ్యక్తులే వారికి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం పాలకమండలి సమావేశం వాడీవేడిగా సాగింది. ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఎదుటే వీసీ రవీందర్‌గుప్తా, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య తీరుపై ఈసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. కామర్స్ విభాగం ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించగా.. వెనువెంటనే ఆయన బాధ్యతలు చేపట్టారు. వచ్చే నెల 27న తదుపరి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ లోగా యూనివర్సిటీని గాడిలో పెట్టాలని వీసీ రవీందర్‌గుప్తాకు పాలకమండలి అల్టిమేటం జారీ చేసింది.
నిజామాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డిచ్పల్లి, అక్టోబర్ 30: టీయూలో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని వీసీ రవీందర్‌గుప్తా తెలిపారు. శనివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. వర్సిటీలో కొత్తగా అవుట్సోర్సింగ్ నియామకాలు ఏమీ చేపట్టలేదన్నారు. ఒకవేళ చేపడితే వాటిని రద్దు చేసినట్లేనని ప్రకటించారు. మళ్లీ నోటిఫికేషన్ వేసి కొత్తవారిని నియమించే వరకు మొన్నటి వరకు కొనసాగిన పార్ట్‌టైం అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన వారికి గైడ్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎమ్మెస్సీ జువాలజీ కొత్త కోర్సును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భిక్కనూరులో ఉన్న సౌత్‌క్యాంపస్‌లో డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, పీజీ డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామన్నారు.సెల్ఫ్ ఫైనాన్స్‌కు సంబంధించిన జీవో నవంబర్ 141ను అమలు చేస్తామని తెలిపారు. ఓయూ మాదిరిగానే టీయూలో మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుచేస్తామని చెప్పారు.
వర్సిటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి: నవీన్‌మిట్టల్
ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించుకున్న విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తేందుకు అధ్యాపకులు ముందుండాలని సూచించారు. ఇకనుంచి వర్సిటీలో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం పలికే విధంగా పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. విశ్వవిద్యాలయం భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆకాంక్షించారు. సమావేశంలో ఆచార్య పి.కనకయ్య, ఆచా ర్య నసీం, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, వసుంధరాదేవి, మారయ్యగౌడ్, ఎల్.ఎన్.శాస్త్రి, గంగాధర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, నాగరాజు ఉన్నారు.