సాహిత్య రంగంలో రాణిస్తున్న తడపాకల్ విద్యార్థులు
ఏర్గట్ల, సెప్టెంబర్ 29: ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తివంతులవుతున్నారు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ విద్యార్థులు. చదువులోనే కాకుండా సాహిత్యరంగంలో ఎనిమిదేండ్ల నుంచి అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ బాలకవులుగా ఎదుగుతున్నారు. ఈ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ శర్మ శిక్షణలో ఇప్పటివరకు 70 మందికి పైగా విద్యార్థులు కథలు, కవితలు, పద్యాలు, సరళ వచన శతకాలు రాస్తూ ఎన్నో పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు తొమ్మిది పుస్తకాలను ఆవిష్కరించుకొని సాహిత్య రంగంలో ఒక గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నారు. అనేక సాహిత్య పోటీలో విద్యార్థులు పాల్గొని బహుమతులు కూడా పొందారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగిన అనేక సాహిత్య పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొనడమే కాకుండా బహుమతులు, ప్రశంసలు పొందారు. అక్షరయాన్ సంస్థ వారు కరోనా కాలంలో నిర్వహించిన జాతీయస్థాయి కవితా పోటీల్లో సౌమ్య అనే విద్యార్థి పాల్గొని, జాతీయస్థాయిలో రెండోబహుమతి పొందింది. ఐఏఎస్ బుర్రా వెంకటేశం ప్రవేశపెట్టిన సరళ వచన శతకం అనే ప్రక్రియలో సమ్రీన్ రాసిన మానవతా శతకానికి అబ్బురపడి రూ. 10వేల నగదు బహుమతిని కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ పుస్తకాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. సాహితీరంగంలో తడపాకల్ విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణ భాషా సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం రోజున సాహిత్య రంగంలో రాణిస్తున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను కూడా అందజేశారు.